సాక్షి, అమరావతి: ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాల వంటి వివిధ వాణిజ్య అవసరాలు, నివాసాల నిర్మాణానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కేటాయించిన ప్లాట్ల వేలం గడువును ఆగస్టు 1న వరకు పొడిగించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 5 లాట్లలో ఉన్న 100 ప్లాట్లను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. తొలుత ఈ నెల 28న ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించగా..ఎక్కువ మంది వేలంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వరకు పొడిగించింది.
వేలం వేసే ప్లాట్ల వివరాలివీ..
► తెనాలి నగరం చెంచుపేటలో లాట్–1లో 250 నుంచి 5,372 చ.గ విస్తీర్ణంలో మొత్తం 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో సినిమా థియేటర్, హెల్త్ సెంటర్, ప్రాథమిక పాఠశాల కోసం మూడు ప్లాట్లు, మిగిలినవి వాణిజ్య సముదాయాల కోసం కేటాయించారు. ఇక్కడ చ.గ. ధర రూ.35,200గా నిర్ణయించారు.
► తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు వద్ద ఉన్న లాట్–2లోని అమరావతి టౌన్‌షిప్‌లో 500 నుంచి 4,065 చ.గ. విస్తీర్ణం వరకు మొత్తం 18 ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో 14 వాణిజ్య ప్లాట్లకు చ.గ. రూ.17,600 గాను.. ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాలలకు కేటాయించిన ప్లాట్లలో చ.గ. రూ.16 వేలుగాను ధర నిర్ణయించారు.
► విజయవాడ పాయకాపురం టౌన్‌షిప్‌లోని లాట్–3లో 550 చ.గ. నుంచి 3 వేల చ.గ. వరకు మొత్తం 10 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం, స్థానిక షాపింగ్ కోసం కేటాయించారు. ఇదే ప్రాంతంలోని లాట్–4లో 100 నుంచి 744 చ.గ. వరకు 29 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, నివాస అవసరాలకు కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల్లోను చ.గ. ధర రూ.25 వేల నుంచి రూ.27,500 వరకు ఉంది.
► ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లోని లాట్–5లో 150 నుంచి 1000 చ.గ. వరకు ఉన్న మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయి. వీటిని దుకాణాలు, కార్యాలయాలు, నివాసానికి కేటాయించారు. వీటిలో మూడు ప్లాట్లకు చ.గ. ధర రూ.11 వేలుగా, మిగిలిన ప్లాట్లలో చ.గ. రూ. 10 వేలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https:// konugolu.ap.gov.in/,https://crda.ap.gov.in/లో పొందవచ్చు.
ఫోన్ ఓటీపీతో రిజిస్ట్రేషన్
పైన పేర్కొన్న ప్లాట్ల కొనుగోలుకు ఫోన్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ–వేలం సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. కొనుగోలుదారులెవరూ అమ్మకందారును కలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా, ఇంటివద్దే ఫోన్ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. తమ సందేహాల నివృత్తి కోసం 0866–2527124 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment