శ్రీవిద్యానికేతన్‌లోనికి వెళ్లేందుకు యత్నించిన మంచు మనోజ్
వీల్లేదని అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం
తన తాత, నానమ్మ సమాధుల వద్దకు వెళ్తానని పట్టు
గేటుకు తాళాలు వేయడంతో అనుచరుల దౌర్జన్యం
ఎంబీయూ సిబ్బంది, బౌన్సర్లపై దాడి.. పోలీసుల లాఠీచార్జ్
ఎట్టకేలకు తాత, నానమ్మ సమాధుల వద్ద నివాళులు
తనను అడ్డుకోవడంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్న మనోజ్
మనోజ్‌పై కూడా ఫిర్యాదు చేస్తామన్న ఎంబీయూ ప్రతినిధి
చంద్రగిరి: కొద్ది రోజులుగా సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తార స్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ శ్రీవిద్యానికేతన్‌లోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం మనోజ్.. తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలసి తిరుపతికి చేరుకున్నారు. సుమారు 200 మందితో కలిసి ర్యాలీగా శ్రీవిద్యానికేతన్ మీదుగా నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ మంత్రి నారా లోకేశ్‌తో సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
అనంతరం ఏ.రంగంపేట వద్ద జరుగుతున్న జల్లికట్టును వీక్షించి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ గేట్లు మూసివేసి, భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన లోపలికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతులు లేవంటూ కోర్టు ఉత్తర్వులను చూపించారు. దీంతో మనోజ్ లోపల ఉన్న పీఆర్వో, ఇతరులను పిలిచారు.
తనను లోపలికి అనుమతించకపోతే రోడ్డుపై బైఠాయిస్తానంటూ హెచ్చరించారు. పండుగ పూట తాత, నానమ్మల సమా«ధుల వద్దకు వెళ్లి నివాళులర్పించి వెళ్తానని చెప్పారు. ఈ క్రమంలో సీఐ సుబ్బరామిరెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం మంచు మనోజ్ కూడా ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వుల్లో స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లకూడదని మాత్రమే ఉందని.. తన తాత, నానమ్మల సమాధులు ప్రాంగణంలో లేవని అసహనం వ్యక్తం చేశారు.
దాడి.. లాఠీ చార్జ్
ఎంబీయూ సమీపంలోని డెయిరీ వద్దకు తన భార్యతో కలిసి చేరుకున్న మనోజ్‌ను అక్కడి వారు అడ్డుకున్నారు. దీంతో ‘రేయ్ ఎవర్రా మీరంతా.. వాళ్లను పట్టుకోండి’ అంటూ మనోజ్ తన అనుచరులను పూరమాయించాడు. మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేటు బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు. ఎంబీయూలో పని చేస్తున్న కిరణ్ కుమార్‌పై దాడి చేశారు.
ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తత నడుమ మంచు మనోజ్.. తన భార్యతో కలిసి తాత, నానమ్మల సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించాడు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవిద్యానికేతన్‌లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
కోర్టు పరిధిలో ఉన్నందున శ్రీవిద్యానికేతన్ లోపలికి వెళ్లడం లేదన్నారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం దారుణం అని, ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కాగా, మనోజ్ తీరుపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎంబీయూ మీడియా ఇన్‌చార్జ్ రవి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment