పలాస గ్యాంగ్ రేప్ నిందితుల కుటుంబాలకు ఆ పార్టీతో నేరుగా సంబంధం
టీడీపీ బడా నేతలతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్
పుట్టిన రోజు వేడుకలకని పిలిచి ఇద్దరు విద్యార్థినులపై దారుణం
మద్యం కలిపిన కూల్ డ్రింక్స్ తాగించిన యువకులు
బరితెగించి అత్యాచారం, ఆపై సెల్‌ఫోన్‌లో రికార్డు
ఘటన బయటకు రాకుండా కీలక నేత బేరసారాలు, బెదిరింపులు
వాటికి లొంగక కేసు పెట్టిన బాధితులు.. ఘటనపై నోరు విప్పని పోలీసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది టీడీపీకి చెందిన వారేనని స్పష్టమైంది. ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన యువకుల కుటుంబీకులంతా టీడీపీలోనే ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబీకులతో రాజీ చేసేందుకు చివరి వరకు రాజకీయ పలుకుబడి ఉపయోగించారు. నియోజకవర్గంలోని ఓ కీలక నేత ద్వారా సంప్రదింపులు చేయించి బేరసారాలకు, బెదిరింపులకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లో రాజీకి అంగీకరించే ప్రసక్తే లేదని, జరిగిన దారుణానికి వెలకట్టడం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ నెల 19వ తేదీన ఇంటి వద్ద తల్లిదండ్రులు లేని సమయంలో వారి ఇద్దరు కుమార్తెల్ని, మరో యువతిని బర్త్‌డే పార్టీకని ముగ్గురు యువకులు పైల శివ, మోహన్, నిందితుడు రాజమహేంద్రం సాయిలు కారులో ఎక్కించుకుని కోసంగిపురం జంక్షన్ వద్ద ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థినులకు మద్యం కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి, రూమ్‌లో బంధించి అత్యాచారం చేసేందుకు తెగబడ్డారు.
ఒక విద్యార్థిని ప్రతిఘటించి తప్పించుకోగా, మిగతా ఇద్దరు బలైపోయారు. నిందితులు వారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం స్పృహ కోల్పోయిన ఆ ఇద్దరు విద్యార్థినుల్ని రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని వారు తల్లికి చెప్పారు.
నిందితులను అరెస్ట్ చేయరా?
అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకడైన పైల శివ చిన్నాన్న పైల జానకీరావు టీడీపీలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటారు. ఈయన బావమరిది చిరు కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈయన కూడా రామ్మోహన్‌నాయుడి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిందితుడు శివ గతంలో కూడా ఇలాంటి ఘాతకానికి పాల్పడి, రాజీ చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మరో నిందితుడు మోహన్. ఇతని మేనమామ వెంకట్ కూడా టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ కీలక నేతలందరితో కలిసి ఉన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అత్యాచార ఘటన బయటకు రాకుండా బాధిత విద్యార్థినుల తల్లికి ఫోన్ చేసి కీలక నేత ఒకరు మాట్లాడినట్లు సమాచారం. తమ కూతుళ్లకు జరిగిన దారుణం పట్ల ఆమె గట్టిగా నిలదీయడంతో పాటు ఈ నెల 21న కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు టీడీపీ కీలక నేతల ద్వారా రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment