ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు బేఖాతరు | FIR on Gudlavalleru incident | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు బేఖాతరు

Published Wed, Sep 4 2024 4:12 AM | Last Updated on Wed, Sep 4 2024 4:12 AM

FIR on Gudlavalleru incident

గుడ్లవల్లేరు ఘటనపై తూతూమంత్రంగా ఎఫ్‌ఐఆర్‌ 

రెండు రోజులుగా కళాశాలలోనే డీఐజీ విచారణ

విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల జులుం 

బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు 

లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గంగాధరరావు ప్రకటన

గుడివాడ రూరల్‌: దేశవ్యాప్తంగా కలకలం రేపిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల లేడీస్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు పెట్టిన వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసినా.. పోలీసులు, ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

ఈ ఘటనపై పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీలకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. వీటిని సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకే తీవ్రంగా కృషి చేస్తున్నారని విద్యార్థి, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహరం వెలుగుచూసి ఆరు రోజులు కావస్తున్నా ఇప్పటికీ వాస్తవాలు బయటకు రాలేదు.  

విద్యార్థి సంఘాల నాయకుల అడ్డగింపు 
ఈ ఘటనపై ఆందోళన చేసేందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమానం వచి్చన ప్రతి ఒక్కరిని విచారించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ గంగాధరరావు కళాశాలలో విచారణ చేస్తున్నా కనీసం మీడియాను అనుమతించడం లేదు. 

కాగా.. హాస్టల్‌ విద్యార్థినులను బలవంతంగా హాస్టల్‌ నుంచి ఇళ్లకు పంపేసిన కళాశాల యాజమాన్యం తొలుత నాలుగు రోజులు సెలవులు అని చెప్పింది. తాజాగా మరో మూడు రోజులు సెలవులు పొడిగించడం అనుమానాలకు తావిస్తోంది. ఆందోళనకు దిగిన విద్యార్థినుల తల్లిదండ్రులను ప్రతిరోజు కళాశాలకు పిల్లలను అదుపు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. 
  
తూతూ మంత్రంగా ఎఫ్‌ఐఆర్‌ 
ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాతి్వక, విజయ్‌కుమార్‌ను ఏ1, ఏ2 నిందితులుగా చేర్చిన పోలీసులు తూతూమంత్రంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితులకు సంబంధించిన అన్ని వివరాలు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. కేవలం పేర్లు మాత్రమే నమోదు చేసి మిగిలిన వివరాలు గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. 

ఎఫ్‌ఐఆర్‌ కాఫీలను సేకరించిన వివిధ పార్టీల నాయకులు పోలీసుల నిర్వాకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కనీసం తండ్రి, ఇంటి పేర్లు కూడా నమోదు చేయలేదని చెబుతున్నారు. నిందితురాలు ఓ ప్రముఖ టీడీపీ నాయకుడు కుమార్తె కావడం, కళాశాల యాజమాన్యం సామాజిక వర్గానికి చెందటంతో కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు నిందితులకు రాచమర్యాదలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఘటనపై మూడు రకాల మాటలు 
ఈ ఘటనపై ఎస్పీ ఆర్‌.గంగాధరరావు ఇప్పటికే మూడు రకాల మాటలు మాట్లాడారు. సెపె్టంబర్‌ 30న అక్కడ ఎలాంటి కెమెరాలు లేవని ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళన పెరగడంతో స్థానిక పోలీస్, కమ్యూనికేషన్‌ అధికారులతో విచారణకు ఆదేశించారు. 

31న గుడ్లవల్లేరు పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది పెద్ద కేసు కాదు. చిన్నదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో మరింత లోతుగా విచారణ నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  

లోతైన విచారణ చేస్తున్నాం : ఎస్పీ
సాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ ఘటనపై లోతైన విచారణ చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు న్యూఢీల్లీ, పుణే నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయని, ముగ్గురు ఐజీ స్థాయి అధికారులు జీవీజీ అశోక్‌కుమార్, ఎం.రవిప్రకాశ్, పీహెచ్‌డీ రామకృష్ణ, ఒక ఎస్పీస్థాయి అధికారుల పర్యవేక్షణలో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రత్యేక బృందాలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ నెట్‌వర్క్‌ సిస్టం, కంప్యూటర్స్‌కు సంబంధించిన అన్ని టెక్నికల్‌ ఆధారాలు, క్లౌడ్‌ వెరిఫికేషన్, డేటాను సమీకరిస్తోందని తెలిపారు. కాలేజీ, హాస్టల్‌లో ఏ రకమైన స్పై కెమెరాలు లేదా ఇంకా ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలు వాడా­రా? లేదా? అనే విషయా­న్ని పరీక్షిస్తారని పేర్కొ­న్నారు. ఈ బృందాలతోపాటు పోలీసు అధికారులు కళాశాల, హాస్టల్స్‌ను పరిశీలించారని, కాలేజీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారని వివరించారు.

మహిళా కమిషన్‌ నోటీసు 
సాక్షి, అమరావతి: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరాల ఘటనపై విచారణ కోసం కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్టు ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రధాన కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఘటనను సుమోటోగా స్వీకరించినట్టు పేర్కొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement