Five Medical Colleges To Be Started In AP This Year: Health Minister Vidadala Rajini - Sakshi
Sakshi News home page

వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు.. 

Published Fri, Jun 2 2023 7:22 AM | Last Updated on Fri, Jun 2 2023 12:46 PM

Five Medical Colleges To Be Started In AP This Year - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య విద్యలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామన్న హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఈ విద్యా సంవత్సరం (2023–24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రవేశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 

రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.. 
ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో మొట్టమొదటగా 1923లో ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019కి అంటే 96 ఏళ్లలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్య విద్యా రంగం అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు. 

నాడు – నేడు పథకం కింద 
రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. కరోనా వ్యాప్తి, లాక్‌ డౌన్‌ వంటి ఒడిదుడుకులను కూడా అధిగమించి వైద్య కళాశాలలు నిరి్మస్తున్నారు. వీటిలో ఐదు కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

కొత్త కళాశాలలతో మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు, ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మానవ వనరులు, ఇతర సదుపాయాలను సమకూర్చింది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో రాష్ట్రంలో స్పెషలిస్ట్‌ వైద్యుల సంఖ్య పెరగనుంది.

ఆగస్టులో అడ్మిషన్లు.. సెప్టెంబర్‌లో తరగతులు  రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతులివ్వడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రి గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మా­ట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 17 కాలేజీలు నిర్మిస్తున్నారని తెలిపారు.

తొలి విడతలో విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం కాలేజీల నిర్మాణం పూర్తయిందని, వీటిలో అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతిచ్చిందని చెప్పారు. ఈ కళాశాలల్లో ఆగస్టులో అడ్మిషన్లు చేపట్టి, సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభిస్తామన్నారు. మెడికల్‌ సీట్ల కోసం రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 2019కి ముందు 1,926 పీజీ సీట్లు ఉండగా, గత నాలుగేళ్లలో కొత్తగా 462 పీజీ సీట్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులతో పాటు కొత్తగా 49 వేల పోస్టులను భర్తీ చేయడం చరిత్రాత్మకమన్నారు. 

విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశారు? 
విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కళాశాల అయినా నిర్మించారా అని మంత్రి ప్రశ్నించారు. బాబు హయాంలో ఒక్క గవర్నమెంట్‌ హాస్పటల్లో కూడా సరైన డాక్టర్లు,  వైద్యం, మందులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సెల్‌ఫోన్ల వెలుతురులో ఆపరేషన్లు చేశారని అన్నారు.

చంద్రబాబు చేసింది శూన్యం.. 
‘40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 14 ఏళ్లు సీఎం.. 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా.. నాకంటే సీనియర్‌ ఎవరున్నారు.’ అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు చూపిన చొరవ మాత్రం శూన్యం. అధికారంలో ఉన్నన్ని రోజులూ ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటును మాత్రమే ప్రోత్సహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో 13 టీడీపీ అధికారంలో ఉండగా ఏర్పడినవే కావడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ఇది కూడా చదవండి: సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్లకు పచ్చ జెండా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement