సాక్షి, అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం, విధివిధానాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ అంశం ఇంకా పరిశీలన దశలోనే ఉందని.. విధివిధానాల రూపకల్పన కోసం అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విరూపాక్షి, చంద్రశేఖర్, సుధలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బుధవారం శాసనసభలో ఈ మేరకు జవాబిచ్చింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించిన పలు ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ జవాబిచ్చారు. ‘ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీపై విధివిధానాలను రూపొందిస్తున్నాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం కింద ఉచితంగా ఒక సిలిండర్‌తో ఎల్‌పీజీ కనెక్షన్ ఇస్తున్నారు.
ఈ ప్రయోజనాన్ని 2016–2024 మధ్య 9,65,361 మంది వినియోగించుకున్నారు. ఇక 2023–24 రబీ ధాన్యం సేకరణకు రూ.1,674 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా.. 50 వేల మంది రైతులకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. మరో 10 రోజుల్లో రూ.674 కోట్లు చెల్లిస్తాం. పౌరసరఫరాల కార్పొరేషన్ రూ.39,550 కోట్ల అప్పుల్లో ఉంది.
అందులో రూ.10 వేల కోట్ల అప్పును వచ్చే మార్చి 31లోగా తీర్చడానికి చర్యలు చేపట్టాం’ అని నాదెండ్ల చెప్పారు. కాగా.. విశాఖపట్నంలో పరిశ్రమలు, కార్గో రవాణా ద్వారా వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు చర్యలు తీసుకుంటోందని ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ జవాబిచ్చారు.
మత్స్యకారులకు ఉరితాడులా జీవో 217
రాష్ట్ర మత్స్యకారులకు ఉరితాడులా తయారైన జీవో 217ను వచ్చే కేబినెట్‌లో రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 2014–19 మధ్య అమలు చేసిన మత్స్యకారులకు చేప పిల్లలు, వలలు, ఐస్ బాక్స్‌లు, బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాల పంపిణీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. 2019–24 మధ్య రోడ్లకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.1,100 కోట్లు, రోడ్ల పునరుద్ధరణకు రూ.950 కోట్లు ఖర్చు చేశారని మంత్రి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులు రూ.3,014 కోట్లతో 1,244 కిలోమీటర్ల మేర రోడ్ల బలోపేతం చేసినట్లు చెప్పారు.
2014–19 మధ్య అమలు చేసిన ఇసుక విధానమే
గత ప్రభుత్వం జేపీ వెంచర్స్ సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు చేసి పెద్ద దోపిడీకి పాల్పడిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారం మీద విచారణ జరుగుతోందన్నారు. ప్రజలు ఇసుక కోసం ఇబ్బందులు పడకూడదని 2014–19 మధ్య అమలు చేసిన విధానాన్నే మళ్లీ అమల్లోకి తెచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment