అర్జునరావు (ఫైల్)
వానపాముల(పెదపారుపూడి)/లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది రావూరి అర్జునరావు (104) కన్నుమూశారు. ఆయన వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో కుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాములలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య మనోరమ, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మనోరమ నాస్తికోద్యమ నాయకుడు గోరా పెద్దకుమార్తె. అర్జునరావు.. గోరాతో కలిసి స్వతంత్ర పోరాటం, సాంఘిక ఉద్యమాల్లో పనిచేశారు. క్విట్ ఇండియా పోరు సమయంలో జైలు జీవితం గడిపారు. అర్జునరావు, మనోరమ గుజరాత్‌లోని గాంధీ సేవాగ్రాం ఆశ్రమంలో గాంధీతో కలిసి రెండేళ్లు ఉన్నారు. ఆ ఆశ్రమంలో మహాత్మాగాంధీ చేతుల మీదుగా జరగాల్సిన వీరి ఆదర్శ (కులాంతర) వివాహం.. ఆయన హత్యకు గురవడంతో నాటి ప్రధాని నెహ్రు చేతుల మీదుగా నిర్వహించారు.
జీవితాంతం సామాజిక పరివర్తనకు కృషిచేసిన అర్జునరావు 2018లో వానపాములలో మార్పు ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం, దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అర్జునరావు భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడలో నాస్తిక కేంద్రానికి తరలించి సోమవారం అంత్యక్రియలు జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment