సాక్షి, అమరావతి: దేశంలో 62 శాతం మంది వంట కోసం ఎల్‌పీజీ (గ్యాస్)ని వినియోగిస్తుండగా 36 శాతం ప్రజలు మాత్రం వంట చెరకునే వాడుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక వెల్లడించింది. 33.8 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు.
1.3 శాతం మంది కిరోసిన్, గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఎల్‌పీజీ వినియోగంలో గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు ఉచితంగా లభిస్తుండటంతోపాటు బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నందున వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భగ్గుమంటున్న గ్యాస్ ధరలు కూడా కారణమే. ఈమేరకు కేంద్ర పర్యావరణ నివేదిక 2023ని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది.
♦ గ్రామీణ ప్రాంతాల్లో 49.4 శాతం మంది ఎల్‌పీజీ వాడుతుండగా 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధార పడుతున్నారు. మూడు శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్ గ్యాస్, కిరోసిన్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు.
♦ పట్టణ ప్రాంతాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్‌పీజీ వాడుతుండగా 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలను వినియోగిస్తున్నారు. 0.3 శాతం మంది పిడకలు, 2.5 శాతం గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, కిరోసిన్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు.
♦ ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపైనే ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై వంట చేస్తుండగా 81.7 శాతం మంది ఎల్‌పీజీ వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment