న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్‌పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఎల్‌పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్‌పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్‌జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు.
ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి...
ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం.
‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్‌లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment