తాజాగా రూ.4,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కారు
సెక్యూరిటీల వేలం ద్వారా రుణాన్ని సమీకరించిన ఆర్బీఐ
ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీల అమలు ఊసే లేదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 80 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.19,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం 7.25 శాతం వడ్డీతో రూ.4,000 కోట్లు అప్పు తీసుకుంది.
పదేళ్ల కాల వ్యవధిలో రూ.వెయ్యి కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకో రూ.1,000 కోట్లు, 23 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1,000 కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని సమీకరించింది. దీంతో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.19,000 కోట్లు అప్పు చేసినట్లైంది.
ఇదేనా సంపద సృష్టి?
వైఎస్సార్ సీపీ హయాంలో పరిమితికి లోబడి రుణాలు తీసుకున్నా ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ నాడు ఎల్లో మీడియా కధనాలను ప్రచురించగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారంటూ వాటి ఆధారంగా చంద్రబాబు బృందం ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 80 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.19 వేల కోట్లు అప్పు చేసినా టీడీపీ అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం గమనార్హం.
ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పెంపు మినహా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటప్పుడు ఈ అప్పులన్నీ ఎందుకోసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు చేయడం ద్వారా కాకుండా సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment