జూలై 7న ప్రారంభమైన కొబ్బరి కొనుగోలు
సేకరణ లక్ష్యం 8 వేల మెట్రిక్ టన్నులు
కొన్నది 750 క్వింటాళ్లు మాత్రమే
సాక్షి అమలాపురం/ అంబాజీపేట: కొబ్బరికాయ నాణ్యత లేదనే సాకుతో స్థానికంగా ఉన్న ‘నాఫెడ్’ (నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఎండు కొబ్బరి (మిల్లింగ్ కోప్రా) చేయకపోవడం, తయారు చేస్తున్న కొద్దిపాటి ఎండు కొబ్బరి నాఫెడ్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం ఓ కారణం కాగా.. దీనికి తోడు కొంతమంది దళారులు కర్ణాటక, తమిళనాడు నుంచి నాణ్యమైన కొబ్బరి కాయలను దిగుమతి చేసుకుని రైతుల ముసుగులో ఈ కేంద్రాల్లో అధిక మొత్తానికి విక్రయిస్తుండడం.. ఇక్కడి రైతుల పాలిట శాపంగా పరిణమించింది.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాఫెడ్ కేంద్రాలు తెరచి నెల రోజులకు పైగా అయ్యింది. జిల్లాలో అంబాజీపేటతోపాటు కొత్తపేట, తాటిపాక, రాజోలు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీలలో ఈ కేంద్రాలను తెరవాల్సి ఉంది. తొలి దఫాగా అంబాజీపేట, కొత్తపేటలలో మాత్రమే ప్రారంభించారు. గత నెలలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వీటిని ఆర్భాటంగా ప్రారంభించారు.
ఈ కేంద్రాలు ప్రారంభించిన తరువాత పది రోజుల పాటు భారీ వర్షాల వల్ల తెరవలేదు. తరువాత తెరిచినా పెద్దగా కొనుగోలు లేకుండా పోయింది. ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం 750 క్వింటాళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ కేంద్రాల్లో వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి ఎనిమిది వేల క్వింటాళ్ల కొబ్బరి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు జరుగుతున్న తీరు చూస్తుంటే లక్ష్యం మేరకు కొనుగోలు చేస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు.
కొబ్బరి కాయ కొనుగోలు చేయాలి
నాఫెడ్‌లో దళారుల ప్రమేయాన్ని తగ్గించి తమ వద్ద నుంచి నేరుగా పచ్చి కొబ్బరి కాయ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 5వ తేదీన మెచ్యూర్ డిహస్క్‌డ్ కోకోనట్ (తయారై వలిచిన కొబ్బరి కాయను) కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం వలిచిన కొబ్బరి కాయలకు క్వింటాల్‌కు రూ.3,013గా ధర నిర్ణయించింది. ఈ ధరకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కాయ కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని కోనసీమ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment