నేటి నుంచి కోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం వెల్లడించారు.
అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి, అల్పపీడన కేంద్రం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ద్రోణి, అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 8న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment