సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి.
కాగా, అక్టోబర్ 20వ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. అయితే, ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం, అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు.. గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కాగా.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక, బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment