సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.
కాగా, ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాను, అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై సాధారణంగాను, రాయలసీమలో చురుగ్గాను కదులుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి తెలంగాణ వరకు ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ద్రోణి పయనిస్తోంది. వీటన్నిటి ఫలితంగా రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది.
కొనసాగిన వర్షాలు
రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం విస్తారంగా వానలు కురిశాయి. విజయనగరం జిల్లా పినపెంకిలో అత్యధికంగా 9.10 సెం.మీ. వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 7.50 సెం.మీ., కాకినాడ జిల్లా కందరాడలో 7.10, అనకాపల్లి జిల్లా చోడవరంలో 6, ప్రకాశం జిల్లా రాచెర్లలో 5.20, నంద్యాల జిల్లా కొండమనాయనిపల్లెలో 5.10, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో 5.94 సెం.మీ. గుత్తి, తాడిపత్రిలో 5.26 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో అత్యధికంగా 8.24 సెం.మీ. వర్షం కురవగా, మిగిలిన మండలాల్లోనూ వర్షాలు కొనసాగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు తీరా వర్షం కురుస్తోంది.
అత్యధికంగా తుగ్గలిలో 6.24 సెం.మీ. వర్షం కురవగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.92 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ చిరు జల్లులు కురిశాయి. మరోవైపు ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. గిద్దలూరు నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు లోతు వాగు, గుండ్లకమ్మ వాగు, ఎర్ర వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment