ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ)
తెలంగాణలోనూ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది. ఇంకా దాని ప్రభావం నుంచి కోలుకోక ముందే తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment