సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఉద్యాన పంటలకు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మొత్తం 17.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 312.34 లక్షల టన్నుల ఉత్పత్తితో మన రాష్ట్రం ఉద్యానపంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఐదో స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించారు.
చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పోషకాహార భద్రత కల్పించేలా ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పటికే స్థూల జాతీయోత్పత్తిలో ఉద్యాన పంటలు ఆరు శాతం ఉండటం శుభపరిణామమని చెప్పారు. ఉద్యానవన రంగం 14శాతం ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని, అందులో 42 శాతం మహిళలకే దక్కడం గొప్ప విషయమన్నారు. సమాజం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు.
రోబోటిక్ టెక్నాలజీ, డ్రోన్‌ల వినియోగం వల్ల ఉత్పత్తి పెరగడంతోపాటు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని, ఈ దిశగా యూనివర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతిక సహకారం అందించడంలో ఉద్యాన వర్సిటీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. వర్సిటీ దశాబ్దంన్నర ప్రయాణంలో విద్య, పరిశోధన, విస్తరణ విభాగాల్లో అద్భుత పురోగతిని సాధించిందని, ఇక్కడ అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో కేంద్రం నోటిఫై చేయడం అభినందనీయమన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త రమేష్ చంద్ మాట్లాడుతూ ఉద్యాన విద్యలో డిగ్రీలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రైతులకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి టి.జానకీరామ్ వర్సిటీ సాధించిన ప్రగతి, లక్ష్యాల గురించి వివరించారు. అనంతరం 1,069 మందికి బీఎస్సీ హానర్స్, 97 మందికి ఎమ్మెస్సీ, 26 మందికి పీహెచ్‌డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు.
‘గోల్డ్ మెడల్స్’ అందుకున్నవారు వీరే...
ఉత్తమ అధ్యాపకుడిగా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ (ఎంటమాలజి)డాక్టర్ ఎన్.ఇమ్మానుయేల్, ఉత్తమ పరిశోధనా శాస్త్రవేత్తగా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.రవీంద్రకుమార్, ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తగా వెంకట్రామన్నగూడెంలోని కేవీకే శాస్త్రవేత్త (మత్స్యసంపద సైన్స్) డాక్టర్ ఎ.దేవీవరప్రసాద్ రెడ్డి బంగారు పతకాలు అందుకున్నారు.
అడ్డా వెంకాయమ్మ గోల్డ్ మెడల్‌ను కొత్తకడప లక్ష్మీకళ (ప్రకాశం), డాక్టర్ టీబీ దాశరథి గోల్డ్‌మెడల్‌ను దుర్గావెంకట రవితేజ అములోతు (గుంటూరు), శంబతరు పావని(వైఎస్సార్), దేవరకొండ పుల్లయ్యశాస్త్రి గోల్డ్ మెడల్‌ను దుంపపెంచల విజయ్‌రెడ్డి (నెల్లూరు), నోరు రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), షాహిద్ లెఫ్ట్‌నెంట్ అమిత్ సింగ్ గోల్డ్ మెడల్‌ను రమావత్ తావుర్యనాయక్ (ప్రకాశం), అన్నే శిఖామణి మెమోరియల్ గోల్డ్ మెడల్‌ను దేవిరెడ్డి మేఘన, గరికిముక్కల పరంజ్యోతి అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment