4 నుంచి ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ | IIIT Admission Counseling Under RGUKT From January 4 In AP | Sakshi
Sakshi News home page

4 నుంచి ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్ల కౌన్సెలింగ్‌

Published Sat, Dec 26 2020 9:19 AM | Last Updated on Sat, Dec 26 2020 10:08 AM

IIIT Admission Counseling Under RGUKT From January 4 In AP - Sakshi

సాక్షి, అమరావతి/నూజివీడు: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌  జనవరి 4వ తేదీనుంచి ప్రారంభం కానుంది. కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో సమాంతరంగా ఈ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ రెండు కేంద్రాల్లో తమకు సమీపంలోని దేనికైనా అభ్యర్థులు హాజరుకావచ్చని అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్‌ ర్యాంకుల ఆధారంగా వర్సిటీ పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్‌ స్కోర్‌ కింద 0.4 మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటించారు.

ప్రత్యేక కేటగిరీలోని దివ్యాంగులు, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్సు మినహా ఇతర అభ్యర్థుల మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. మెరిట్‌ ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ.ఐఎన్‌’లో ఉంచారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు ఏ రోజున హాజరుకావాలో ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తారు. అభ్యర్థులు జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 8 గంటలకల్లా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండేసి జిరాక్స్‌ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. జనవరి 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులలో ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి, దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన జనవరి 2న నూజివీడు క్యాంపస్‌లో చేపట్టనున్నారు. ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1,100 సీట్లు భర్తీ చేస్తారు. దీన్లోనే కేంద్రప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం అదనపు కోటా కింద 100 సీట్లు ఉన్నాయి.  

85 శాతం ఏపీ లోకల్, 15 శాతం ఏపీ, తెలంగాణ వారికి.. 
రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్‌ 371డీ ప్రకారం మొత్తం సీట్లలో 85 శాతం ఏపీ స్థానికత ఉన్న అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్‌ కేటగిరీ కింద ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మెరిట్‌ ప్రాతిపదికన కేటాయిస్తారు. 85 శాతం లోకల్‌ కోటాలో రిజర్వేషన్లను అనుసరించి ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ కోటాలో 1 శాతం, స్పోర్ట్సు కోటాలో 0.5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.1/3 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు. బాలికలు లేనట్లయితే అదే కేటగిరీ బాలురతో ఆ సీట్లు భర్తీచేస్తారు.

ట్రిపుల్‌ఐటీల్లో కోర్సులు 
నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులున్నాయి. నూజివీడు, ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో అదనంగా కెమికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులున్నాయి. 

కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు 
► ఆర్జీయూకేటీ సెట్‌ మార్కుల మెమో
► ఆర్జీయూకేటీ ర్యాంకు కార్డు 
► టెన్త్‌ హాల్‌టికెట్‌
► నివాస ధ్రువపత్రం (ఏపీ లోకల్‌) 
► నివాస ధ్రువపత్రం లేదా పేరెంట్సు సర్వీస్‌ సర్టిఫికెట్‌ (నాన్‌లోకల్‌ కేటగిరీ) 
► కుల ధ్రువీకరణపత్రం
► ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రం
► దివ్యాంగ ధ్రువపత్రం
► సీఏపీ ధ్రువపత్రం l
ఎన్‌సీసీ, స్పోర్ట్సు ధ్రువపత్రాలు 
(ఆయా ధ్రువపత్రాలు ఆర్జీయూకేటీ నిర్దేశించిన ప్రొఫార్మాల్లో ఉండాలి)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement