నిషేధం అమల్లో ఉన్నా లెక్క చేయని డిస్కంలు
రోజుల వ్యవధిలోనే మారిపోతున్న స్థానాలు
అవినీతి కేసులున్న వారికి ప్రాధాన్యత పోస్టులు
ముడుపులు, సిఫారసులకే తలొంచిన సీఎండీలు
సాక్షి, అమరావతి: ‘ఏలూరు ఆపరేషన్ సర్కిల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న కె.మధుకుమార్‌ను నరసాపురం ఆపరేషన్ ఈఈగా అక్టోబర్ 5న బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పదవీ విరమణ చేసే వారిని బదిలీ చేయకూడదు. కానీ ఆరు నెలల్లో రిటైర్ అయ్యే బి.సురేశ్ కుమార్‌ను ఆయన స్థానంలో నియమించారు. పలాసలో కొత్త పోస్టు సృష్టించి మరీ టెక్కలి లైన్ ఇన్‌స్పెక్టర్ బి.కోదండరావును అక్టోబర్ 26న అక్కడికి బదిలీ చేశారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)గా అక్టోబర్ 25న బదిలీపై భీమవరం నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వచ్చిన ఎం.రాజగోపాల చౌదరి వారం రోజులకే కాకినాడ టౌన్ ఆపరేషన్ డీఈఈగా అక్టోబర్ 30న బదిలీపై వెళ్లిపోయారు.’.. ఇవి విద్యుత్ సంస్థల్లో అక్రమ బదిలీలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
నిబంధనల ప్రకారం సెపె్టంబర్ 22 నుంచే బ్యాన్ అమలులోకి వచ్చింది. కానీ అది విద్యుత్ సంస్థల్లో ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నవంబర్ వచ్చినా ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ముడుపులు చేతులు మారడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలున్న వారికే ప్రాధాన్యత
విద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు సగటున ఐదు సిఫారసు లేఖలను విద్యుత్ సంస్థలకు ఇచ్చారు. ఒక్కో పోస్టుకు వచ్చిన డిమాండ్‌ను బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు సిఫారసు లేఖలు మంజూరు చేసి, అందిన కాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే ఇబ్బందులు తలెత్తాయి.
సిఫారసు లేఖల ప్రకారం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడంతో కొన్ని పోస్టులు కూటమి పెద్దల అభిమతానికి విరుద్ధంగా జరిగాయి. దీంతో ఆగ్రహానికి గురైన నేతలు మళ్లీ ఒత్తిళ్లు తెచ్చి తమ వారికి పోస్టింగులు తెప్పించుకుంటున్నారు. అందుకోసమే బ్యాన్ అమలులో ఉన్నా వందల మందికి బదిలీలు చేయించుకున్నారు.
ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు ఉన్న వారికి కూడా ప్రాధాన్యత పోస్టులు ఇప్పించుకుంటున్నారు. భీమవరం టౌన్ సబ్ డివిజన్‌లో టిడ్కో ఇళ్లకు ఇవ్వాల్సిన దాదాపు 250 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రిని పక్కదారి పట్టించారనే ఆరోపణలున్న డీఈఈని ఆ స్కామ్ నుంచి కాపాడేందుకు తాడేపల్లిగూడెం బదిలీ చేశారు. కానీ అక్కడ పొసగకపోవడంతో ఆయన పైరవీలు చేసుకుని కాకినాడలో ప్రాధాన్యమున్న పోస్టుకు వెళ్లిపోయారు.
విద్యుత్ పంపిణీ సంస్థల్లో జరుగుతున్న ఈ అక్రమ బదిలీలపై విజిలెన్స్ అధికారులు కళ్లు మూసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసులకు డిస్కంల సీఎండీలు తలొంచి, సంస్థల పరువు మంటగలపడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment