
విమానాశ్రయం (గన్నవరం): దేశ ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (గన్నవరం) సర్వీస్‌లు నడిపేందుకు మరో ఎయిర్‌లైన్స్ సంస్ధ ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ రూట్‌లో ఎయిరిండియా సంస్థ విజయవంతంగా సర్వీస్‌లు నడుపుతోంది. దీంతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆగస్టు 16 నుంచి సర్వీస్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు విమాన ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టికెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ సర్వీస్ నిమిత్తం 180 మంది ప్రయాణికుల సామర్ధ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ320 విమానాన్ని వినియోగించనున్నారు. ఈ విమానం ముంబై నుంచి రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9.00కు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రారంభ టికెట్ ధరలు ముంబై నుంచి విజయవాడకు రూ.3,645, విజయవాడ నుంచి ముంబైకి రూ. 3,712గా నిర్ణయించారు. ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూకే, యూఎస్‌ఏ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని తెలిపారు.
త్వరలో చెన్నైకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్
చెన్నై నుంచి విజయవాడకు త్వరలో చౌక ధరల విమాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో ఇండిగో మాత్రమే సర్వీస్‌లను నడుపుతోంది. కొత్త సర్వీసులకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment