శాస్త్రోక్తం గా శ్రీవారి ధ్వజారోహణ
తొలిరోజు స్వర్ణశేష వాహనంపై భక్తులను అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి
ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణం శాస్త్రోక్తం గా నిర్వహించారు. వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) సా. 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంలో అర్చకులు ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా రామకృష్ణ దీక్షితులు క్రతువును నిర్వహించి మంగళ ధ్వనులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ వైభవానికి పతాకావిష్కరణ చేశారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. శనివారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
ఇక శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమర్పించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు.
అనంతరం.. ప్రభుత్వం తరఫున చంద్రబాబు పట్టువ్రస్తాలను తలపైన పెట్టుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించారు.
శ్రీవారి ఆలయంలో ఇష్టారాజ్యం..
మరోవైపు.. శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలు సమర్పించే సమయంలో సీఎంఓ సిబ్బంది, నాయకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అనుమతిలేకపోయినా సుమారు 25 మంది వరకు ఆలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబుతో నాయకులు, అధికారులు యథేచ్ఛగా ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిక్లరేషన్‌లో సంతకం పెట్టకుండానే ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment