![ISRO first launch from Kulasekharapatnam today - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/28/isro.jpg.webp?itok=ihlxQ1OI)
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సిద్ధమవుతున్న మరో స్పేస్ పోర్టు
సూళ్లూరుపేట: ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్ పోర్టును సిద్ధం చేస్తోంది. అక్కడి పోర్టు నుంచి బుధవారం రోహిణి సౌండింగ్ రాకెట్–200ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేయనున్న ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, ఎస్‌ఎస్‌ఎల్‌వీలాంటి చిన్నతరహా రాకెట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది.
ఐదారేళ్ల క్రితమే తూర్పుతీర ప్రాంతంలో రెండో స్పేస్ పోర్టు నిర్మించాలనే ఉద్దేశంతో స్థలాన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాగాయలంకను పరిశీలించారు. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం వద్ద భూములను పరిశీలించారు. వెంటనే స్థలసేకరణ జరిపారు.
స్పేస్ పోర్టు ఏర్పాటు చేసేటపుడు ముందుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసి అక్కడ గ్రావిటీ పవర్, సముద్రపు వాతావరణం, భూమికి అతితక్కువ దూరంలో వాతావరణంలో తేమలాంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. కులశేఖరపట్నం నుంచి రోహిణి సౌండింగ్–200 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు సూళ్లూరుపేటలోని శ్రీహరికోట సెంటర్ నుంచి 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తరలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment