బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖ సాగరతీరం దీపకాంతులతో ప్రకాశించింది. ఆర్కేబీచ్ భక్తులతో కిటకిటలాడింది. సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో మహాదీపోత్సవం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం మూడుగంటలకు శోభయాత్రతో బయలుదేరిన శ్రీవేంకటేశ్వరస్వామి సాయంత్రానికి ఆర్కేబీచ్ ప్రధానవేదిక వద్దకు చేరుకున్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రమిదలు, ఒత్తులు, మండపాలు, తులసి మొక్కలను టీటీడీ సమాకుర్చింది. డాక్టర్ పి.వి.ఎస్.ఎన్.మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు శ్రీఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించింది.
అనంతరం డాక్టర్ మారుతి దీపప్రాశస్త్యాన్ని వివరించారు. టీటీడీ ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన చేశారు. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం శ్రీమహాలక్ష్మి పూజ చేశారు. భక్తులతో తొమ్మిదిసార్లు దీపమంత్రం పలికిస్తూ సామూహిక లక్ష్మీనీరాజనం సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణతో విశాఖ సాగరతీరం మారుమోగింది. ఈ సందర్భంగా బాలకొండలరావు నేతృత్యంలో బృందం ప్రదర్శించిన దీపలక్ష్మీనమోస్తుతే నృత్యరూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివరిగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు కీర్తిస్తుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
టీటీడీ హిందూధర్మ ప్రచారం అద్భుతం
ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మాట్లాడుతూ టీటీడీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచారం చేస్తోందని అభినందించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతోపాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో జమ్ములో శ్రీవారి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారు. స్వామికి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. టీటీడీ జేఈవో సదా భార్గవి, మంత్రి అమర్‌నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవేణుగోపాల దీక్షితులు, శ్రీశేషాచల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment