
సాక్షి, అమరావతి/రాజుపాళెం(వైఎస్సార్ జిల్లా) /పరిగి(అనంతపురం): రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు.
ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
స్వగ్రామంలో సంబరాలు..
వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని పర్లపాడుకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి.. తండ్రి వెంకటపతిరెడ్డి తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజేంద్రనాథ్‌రెడ్డి సోదరుడు వ్యాపారవేత్తగా రాణిస్తుండగా.. సోదరి కర్నూలు జిల్లా నంద్యాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్రనాథ్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారని పర్లపాడు గ్రామస్తులు చెప్పారు. ఆయన మైదుకూరు ప్రభుత్వ పాఠశాల, అనంతపురంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1992లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
ఆయనకు ప్రభుత్వం డీజీపీ బాధ్యతలు అప్పగించడంతో స్వగ్రామం పర్లపాడులో గ్రామస్తులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. గ్రామంలోని శివాలయంలో ఆయన పేరు మీద పూజలు, అభిషేకాలు నిర్వహించగా.. ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విద్యాభ్యాసం చేసిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు మురళీధరబాబు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు
Comments
Please login to add a commentAdd a comment