Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Team India Beat England By 336 Runs In 2nd Test1
పదేసిన ఆకాశ్‌దీప్‌.. ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్‌ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్‌ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్‌ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం​ పట్టాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్‌లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్‌ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన జేమీ స్మిత్‌ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (162 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్‌‌), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (158), జేమీ స్మిత్‌ (184 నాటౌట్‌) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 6, ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (269) భారీ డబుల్‌ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారత్‌పై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో టెస్ట్‌ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరుగనుంది. గిల్‌ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి గెలుపు.

Talha Saeed Hits Back Bilawal's remark2
ఉగ్రవాదుల్ని భారత్‌కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్‌?

కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్‌ సయ్యద్‌, మసూద్‌ అజహర్‌లను భారత్‌కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్‌ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్‌కు చెందిన ఆల్‌ జజీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్‌ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్‌.లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్‌తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ ఎటువంటి అభ్యంతరం చెప‍్పదని పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ చైర్మన్‌ బిలావాల్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్‌ సహకరించాలన్నారు. ఇందుకు భారత్‌ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్‌ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్‌ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్‌ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్‌కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్‌!బిలావల్‌ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్‌ సయ్యద్‌ కుమారుడు తల్హా సయీద్‌ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్‌ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Should I Speak in Marathi or English CJI Gavai3
నేను మరాఠిలో మాట్లాడాలా.. ఇంగ్లిష్‌లోనా?: సీజేఐ

ముంబై: మహారాష్ట్రలో మరాఠీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో ఇప్పుడు ఆ భాష తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై సీజేఐ బీఆర్‌ గవాయ్‌ సరదాగా స్పందించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 6) ముంబైలోని తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్‌ను సందర్భించిన గవాయ్‌.. స్కూల్‌ పిల్లలతో సరదాగా గడిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడే క్రమంలో మరాఠీ భాషలో మాట్లాడాలా? లేక ఇంగ్లిష్‌లో మాట్లాడాలా? అనే సందిగ్ధత ఆయనకు కూడా ఏర్పడింది. ‘ఇప్పుడు నేను మరాఠీలో మాట్లాడాలా?, లేక ఇంగ్లిష్‌లోనా?’ అని అక్కడున్న టీచర్‌ను అడిగారు. మేడమ్‌ అయితే మరాఠిలో చక్కగా మాట్లాడారు. కానీ తాను మరాఠీలో మాట్లాడితే అంతా అర్థం చేసుకుంటారు కదూ..? అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారుదీని తరువాత సీజేఐ గవాయ్‌.. తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు. తాను మాతృభాషలో మాట్లాడటంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు .. ప్రశం‍సల సైతం అందుకున్నారు. గవాయ్ తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు, తన మాతృభాషలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అందరి దృష్టిని మరియు ప్రశంసలను పొందారు.మహారాష్ట్రలో మరాఠీ వాడకాన్ని అమలు చేయడం లేదా ప్రోత్సహించడం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యంగా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో కూడిన ఇటీవలి వివాదాల తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. తాను చదువుకున్న చికిత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలలోని తరగతి గదులను కూడా సందర్శించారు. ఇక్కడ తన పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు సీజేఐ. ఈ క్రమంలోనే మాతృభాషలో చదువుకోవడం వల్ల విషయం లోతైన అవగాహన ఏర్పడుతుందని, అది జీవితాంతం మనతో పాటే ఉండే అత్యంత అమూల్యమైనదిగా ఆయన అభివర్ణించారు.

Elon Musk America Party to contest 2028 US elections, here what Musk says4
‘రెండు తలల పాము’తో మస్క్‌ ఎలక్షన్‌ ‘వెర్రి’!

వాషింగ్టన్‌: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అం‍టూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్‌ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్‌ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్‌ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్‌ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్‌ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్‌ సౌతాఫ్రికన్‌ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్‌ 2, సెక్షన్‌ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్‌ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్‌ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్‌కే మద్దతు ఈ క్రమంలో మస్క్‌ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్‌ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్‌ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్‌ మస్క్‌ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్‌ లేజర్‌ ఫోకస్‌ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్‌ మస్క్‌ లేజర్‌ ఫోకస్‌ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్‌ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తరుఫున మస్క్‌ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్‌. నేను ఆఫ్రికన్‌. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్‌ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్‌ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు.

btech student dies in jagtial district   5
ప్రాణం తీసుకున్న బీటెక్‌ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!

సాక్షి,హైదరాబాద్‌: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్‌ మండలం జాబితాపూర్‌లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్‌లోని ఓ ఉమెన్స్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్‌ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్‌కు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్‌కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది.

Vivek Oberoi says he raised Rs 8500 crore for his companies in just one year6
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..

ప్రముఖ బాలివుడ్‌ నటుడు వివేక్ ఒబెరాయ్ పక్కా బిజినెస్‌మ్యాన్‌గా మారిపోయారు. సినీ పరిశ్రమపై తనకు విరక్తి పెరిగిందని, అందుకే తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టానని ఆయన చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నటుడు ఇప్పుడు తన ప్రధాన జీవనాధారాన్ని పూర్తిగా బిజినెస్‌ వైపు మళ్లించారు.తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 కంపెనీలకు ఒక్క ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించినట్లు తెలిపారు. వీటిలో రెండు కంపెనీలు ఐపీవోకి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని వివేక్‌ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నెట్‌వర్త్‌ రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.భూమి మొదటి వ్యాపారంఇటీవల సీఎన్‌బీసీ టీవీ-18 ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ తన వ్యాపార సంగతులను పంచుకున్నారు. తన తండ్రి సురేష్ ఒబెరాయ్ వ్యాపారవేత్త కావడంతో తాను కూడా చిన్న వయసు నుంచే వ్యాపారం వైపు మొగ్గు చూపానని చెప్పారు. ‘ఇన్వెస్టర్‌ అయిన ఆయన (తండ్రి) ఎప్పుడూ భూములు కూడబెడుతూ కొనడం, అమ్మడం చేసేవారు. అలా డబ్బు సంపాదించేవారు. భూమి నాకు పరిచయమైన మొదటి వ్యాపారం. నాకు తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు అకస్మాత్తుగా ఇన్వెంటరీతో వచ్చేవాడు. ఒక సంవత్సరం పెర్ ఫ్యూమ్స్, మరో ఏడాది ఎలక్ట్రానిక్స్... వాటిని నా బ్యాక్ ప్యాక్ లో నింపుకుని ఇంటింటికీ వెళ్లేవాన్ని. చివరిలో నా 'లెక్కలు' అడుగేవారు. లాభం మాత్రం నాకిచ్చి మిగిలింది తీసుకునేవారు' అని వివేక్ గుర్తు చేసుకున్నారు.సినిమాల్లో లోపించిందదే..కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో గడిపిన వికేక్‌ ఒబెరాయ్‌ ఇంకా తాను మొదలుపెట్టిన చోటే ఉన్నానని గ్రహించారు. "అది (సినీ పరిశ్రమలో ఉండటం) నాకు నచ్చలేదు. అది ఎదుగుదల కాదు. నేను అక్కడ ఉండటం, కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ ఇది ఎదుగుదలకు తోడ్పడాలి. ఎవరైనా ప్రతిభ ఉన్నవారిని దగ్గరకు తీసి వారి ఎదుగుదలకు సహకారం అందించాలి. అక్కడ లోపించిందదే" అని చెప్పుకొచ్చిన వివేక్‌ నిరాశగా తల కొట్టుకుంటూ అక్కడే ఉండటం కన్నా వ్యాపారం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.పెట్టుబడుల విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులకూ తాను వెనుకాడనని చెప్పిన వికేక్‌ ఒబెరాయ్‌.. ‘గత ఏడాదిలోనే నా కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించగలిగాం. ఇది గణనీయమైన మొత్తం. అయినా అదేం సమస్య కాదు. అయితే ఆ నిధులను ఎక్కడ పెట్టాలి.. ఎలా ఆ వృద్ధి చేయాలన్నది తెలియాలి. అందుకు మార్వాడీ మనస్తత్వం అలవర్చుకోవాలి" అంటూ సూచించారు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతర్జాతీయ చిత్రాలను 'కాపీ' చేసినా వాటికి 'దేశీ మసాలా' తగిలిస్తున్నామంటూ చెబుతుంటారు. "మరి దీన్ని వ్యాపారంలో ఎందుకు చేయకూడదు?" అంటూ ప్రశ్నిస్తున్నారు.

MLC 2025: FAF DU PLESSIS Is The First Player In T20 History To Be Retired Out In 90's7
నిస్వార్థ ఆటగాడు.. 90ల్లో సెంచరీని త్యాగం చేసి చరిత్ర సృష్టించిన డుప్లెసిస్‌

క్రికెట్‌లో జట్టు ప్రయోజనాల కోసం వ్యక్తిగత మైలురాళ్లను స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఈ కోవలో ముందు వరుసలో ఉంటాడు. డుప్లెసిస్‌ తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తప్పుకొని నిస్వార్థ ఆటగాడనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో డుప్లెసిస్‌ టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌ను నాయకత్వం వహిస్తాడు. ఈ సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 409 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 6) జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్‌ జట్టు సూపర్‌ కింగ్స్‌ సియాటిల్‌ ఓర్కాస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ 91 పరుగుల వద్ద రిటైర్డ్‌ ఔట్‌గా స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. సెంచరీ చేసే అవకాశం (ఇంకో ఓవర్‌ మిగిలి ఉంది) ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం అతనీ నిర్ణయం తీసుకున్నాడు. తాను తప్పుకుంటే ఆతర్వాత వచ్చే డొనొవన్‌ ఫెరియెరా ధాటిగా బ్యాటింగ్‌ చేసి జట్టు స్కోర్‌ను మరింత పెంచుతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుప్లెసిస్‌ మ్యాచ్‌ అనంతరం తెలిపాడు. వాస్తవానికి డుప్లెసిస్‌ ఈ త్యాగం​ చేయాల్సిన అవసరం లేదు. అతడు కూడా భారీ హిట్టరే. అందులోనూ ఈ మ్యాచ్‌ అతని జట్టుకు పెద్దగా ఉపయోగపడేది కాదు. సూపర్‌ కింగ్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే ఈ గెలుపుతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరింది. అది వేరే విషయం. డుప్లెసిస్‌ నిస్వార్థంగా సెంచరీని త్యాగం చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ ఉదంతంతో క్రికెట్‌ అభిమానులకు అతనిపై గౌరవం మరింత పెరిగింది. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ ఆటగాడు అవకాశం ఉండి కూడా స్వచ్ఛందంగా సెంచరీ చేసి అవకాశాన్ని వదులుకోవడం బహుశా ఇదే మొదటిసారి.ఈ సీజన్‌లో (MLC) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌ మరో సెంచరీ (మూడోది) చేసి చరిత్రపుటల్లో చిరస్థాయిగా తన పేరును లిఖించుకునే అవకాశాన్ని స్వచ్ఛందంగా వద్దనుకున్నాడు. ఫెరియెరా బ్యాటింగ్‌కు వస్తే తన జట్టు 200 పరుగుల మార్కును దాటుతుందని భావించి రిటైర్డ్‌ ఔట్‌గా క్రీజ్‌ను వదిలాడు. తీరా చూస్తే ఆ ఫెరియెరా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌ సూపర్‌ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ.. డుప్లెసిస్‌ (52 బంతుల్లో 91; 6 ఫోర్లు, 4 ఫోర్లు), శుభమ్‌ రంజనే (41 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఓర్కాస్‌.. ఆడమ్‌ మిల్నే (3.4-1-23-5) ఐదేయడంతో 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో ఓర్కాస్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.ఇప్పటికే సూపర్‌ కింగ్స్‌, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్లు ఆఫ్స్‌ బెర్తలను ఖారారు చేసుకోగా.. నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్‌, ఓర్కాస్‌ మధ్య పోటీ జరుగుతుంది. ఈ రెండు జట్లకు తలో 6 పాయింట్లు ఉన్నాయి. ఓర్కాస్‌ తమ మొత్తం మ్యాచ్‌లను పూర్తి చేసుకోగా.. న్యూయార్క్‌కు మరో అవకాశం ఉంది. న్యూయార్క్‌ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో (వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే ఓర్కాస్‌కు నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

Dhurandhar: Sara Arjun Opposite of Ranveer Singh And 20 Year Age Gap Sparks Debate8
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. 40 ఏళ్ల హీరోతో..

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ మూవీ దురంధర్‌ (Dhurandhar Movie). సంజయ్‌ దత్‌, ఆర్‌.మాధవన్‌, అర్జున్‌ రాంపాల్‌, అక్షయ్‌ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్‌వీర్‌ బర్త్‌డే సందర్భంగా దురంధర్‌ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో మాస్‌ అవతార్‌లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా..ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సారా అర్జున్‌. ప్రముఖ నటుడు రాజ్‌ అర్జున్‌ కూతురే సారా. సౌత్‌లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్‌తో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్‌ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్‌ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్‌ సెల్వన్‌ మూవీలో ఐశ్వర్యరాయ్‌ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 20 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్‌గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్‌వీర్‌తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్‌ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్‌ ది రాజాసాబ్‌ మూవీ రిలీజ్‌ అవుతుండటం గమనార్హం. చదవండి: కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి

A woman fell bed sick was left near temple9
కర్కశత్వం.. ‘అమ్మ’ను గుడి దగ్గర వదిలేశారు..!!

పెద్దపప్పూరు(అనంతపురం): అంధురాలు.. ఆపై నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రంలో అనాథలా ఉండిపోయింది. పుట్లూరు మండలం కందికాపుల గ్రామానికి చెందిన సంజమ్మను ఎవరో పది రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆరుబయట దోమల బెడదతో పాటు ఈదురుగాలులకు వణుకుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే పాముల ఆది అనే భక్తుడు అమెను చూసి చలించిపోయి సపర్యలు చేస్తున్నారు. ఆమెకు స్నానం చేయించి.. అన్నపానీయాలు అందిస్తున్నారు. అలాగే వదిలేస్తే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో అటువైపు వెళ్లిన ‘సాక్షి’ సదరు మహిళ సమీప బంధువుల ఫోన్‌ నంబర్‌ సేకరించి పరిస్థితి వివరించింది. సంజమ్మ యల్లనూరులో ఉందనుకున్నామని, వెంటనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపి అశ్వత్థం నుంచి తీసుకెళ్లాలని తెలియజేస్తామని సమాధానమిచ్చారు.

Rise in anti social activities check details here10
హెచ్చుమీరిన అసాంఘిక కార్యకలాపాలు.. విచ్చలవిడిగా వ్యభిచారం!

అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement