
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు మెచ్చేలా రామరాజ్యం మాదిరి సంక్షేమ పాలన కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎలాంటి కరువు పరిస్థితులు ఉండేవో ప్రజలందరికీ తెలుసునన్నారు. మంగళవారం దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పేద ప్రజలకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని, అందుకే భగవంతుడు ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మూడు వేల కొత్త ఆలయాలు నిర్మాణం చేపడుతుండగా.. కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కార్యక్రమాల ద్వారా మరో రూ. 270 కోట్లతో వివిధ జిల్లాల్లో పురాతన ఆలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు.
వీటికి తోడు తగినంత ఆదాయం లేక రోజూ నిత్య పూజలు జరగని ఆలయాలకు డీడీఎన్‌ఎస్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా రూ. 3,500 ఆదాయం లేని ఆలయాలకు కొత్తగా ధూప దీప నైవేద్య పథకంలో ఆర్థిక తోడ్పాటు అందజేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
దేవుడి భూములను ఆక్రమించుకున్న వారి ఆట కట్టించేందుకు దేవదాయ శాఖ చట్టానికి కొత్తగా సవరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. శ్రీశైలం ఆలయం వద్ద కొత్తగా అన్నదానం సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు వచ్చాయని, వాటికి భూ కేటాయింపుల ద్వారా శ్రీశైల మల్లిఖార్జునస్వామి వారికి కూడా ఆదాయం దక్కేలా విధివిధానాలు తీసుకురానున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment