నెల్లూరులో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌.. ఎస్‌ఐపీబీ ఆమోదం | Kribhco Bio Ethanol Plant In Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌.. ఎస్‌ఐపీబీ ఆమోదం

Published Fri, May 13 2022 8:31 AM | Last Updated on Fri, May 13 2022 8:54 AM

Kribhco Bio Ethanol Plant In Nellore - Sakshi

అమరావతి: రాష్ట్రంలో బయో ఇథనాల్‌ ప్లాంట్‌తో పాటు ఎగుమతులు, లాజిస్టిక్‌ రంగాలను ప్రోత్సహించే విధంగా తీసుకు వస్తున్న కొత్త పాలసీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐపీబీ సమావేశం.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్‌కో) రూ.560 కోట్లతో 250 కేఎల్‌డీ సామర్థ్యంతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
చదవండి: మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..

100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌ ద్వారా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బయో ఇథనాల్‌ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో మరిన్ని విత్తన శుద్ధి, వివిధప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడానికి క్రిబ్‌కో ఆసక్తి వ్యక్తం చేసింది. వచ్చే ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేసే విధంగా ఏపీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా లాజిస్టిక్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్‌ పాలసీ 2022–27లో మరిన్ని రాయితీల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

సముద్ర ఎగుమతులపై దృష్టి సారించండి: సీఎం 
దేశ వ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల్లో 46% మన రాష్ట్రం నుంచే ఉండటంతో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయని, విదేశాలకు వెళ్లి తిరస్కరణకు గురి కాకుండా ఇక్కడి నుంచే నాణ్యత గల ఉత్పత్తులను పంపే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ఉపయోగించుకుని, ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

పారిశ్రామిక రంగంలో అత్యంత పారదర్శక విధానాలను ప్రవేశ పెట్టామని, సింగిల్‌ డెస్క్‌ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానంపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. విశాఖపట్నంలో డేటా సెంటర్‌ త్వరితగతిన ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌ కె రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement