kribhco
-
సీఎం జగన్‌ను కలిసిన క్రిబ్కో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రిబోకో ఛైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్ కలిశారు. డిసెంబర్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపనకు సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. రూ.300 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులు క్రిబోకో ప్రారంభించనుంది. డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏర్పాటుపై కూడా సీఎంతో క్రిబ్కో చైర్మన్ చర్చించారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. సీఎం ని కలిసిన వారిలో క్రిబ్కో వైస్ చైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి, క్రిబ్కో ఎండీ రాజన్ చౌదరి, మార్కెటింగ్ డైరెక్టర్ వీఎస్ఆర్ ప్రసాద్ ఉన్నారు. -
నెల్లూరులో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్.. ఎస్ఐపీబీ ఆమోదం
అమరావతి: రాష్ట్రంలో బయో ఇథనాల్ ప్లాంట్‌తో పాటు ఎగుమతులు, లాజిస్టిక్ రంగాలను ప్రోత్సహించే విధంగా తీసుకు వస్తున్న కొత్త పాలసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశం.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. చదవండి: మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు.. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బయో ఇథనాల్ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో మరిన్ని విత్తన శుద్ధి, వివిధప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి క్రిబ్కో ఆసక్తి వ్యక్తం చేసింది. వచ్చే ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేసే విధంగా ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా లాజిస్టిక్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్ పాలసీ 2022–27లో మరిన్ని రాయితీల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సముద్ర ఎగుమతులపై దృష్టి సారించండి: సీఎం దేశ వ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల్లో 46% మన రాష్ట్రం నుంచే ఉండటంతో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయని, విదేశాలకు వెళ్లి తిరస్కరణకు గురి కాకుండా ఇక్కడి నుంచే నాణ్యత గల ఉత్పత్తులను పంపే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ఉపయోగించుకుని, ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశ్రామిక రంగంలో అత్యంత పారదర్శక విధానాలను ప్రవేశ పెట్టామని, సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానంపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ త్వరితగతిన ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యూరియా కుంభకోణంపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది జూలైలో వెలుగుచూసిన యూరియా కుంభకోణంపై వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ గురువారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. క్రిబ్కో కంపెనీ నుంచి వచ్చిన 1,300 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు చెందిన మిక్సింగ్ ప్లాంట్‌కు మళ్లించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేశారు. అలాగే కమిషనరేట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో మరో బృందం రెండు రోజుల పాటు విచారణ చేపట్టి.. కమిషనర్‌కు నివేదిక అందజేసింది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ - పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవికుమార్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల సస్పెన్షన్‌ను రద్దు చేసి.. పోస్టింగ్ ఇచ్చారు. మల్లికార్జున మడకశిర ఏడీఏగా, రవికుమార్ హిందూపురం ఏడీఏగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ ఇద్దరు అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణకు కమిషనరేట్ జేడీఏ శ్రీధర్‌ను నియమించిన నేపథ్యంలో ఆయన విచారణ మొదలు పెట్టారు. ప్రెజెంటింగ్ అధికారిగా నియమితులైన రైతు శిక్షణ కేంద్రం డీడీఏ డి.జయచంద్ర సమక్షంలో ఏడీఏలు మల్లికార్జున, రవికుమార్‌ను వేర్వేరుగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఆ ఇద్దరూ విచారణాధికారి ముందు చెప్పినట్లు సమాచారం. ఎరువులు దారి మళ్లినట్లు తెలియగానే తనిఖీలతో పాటు ప్రాథమిక విచారణ చేశామని మల్లికార్జున చెప్పగా... రేకు ఆఫీసర్ అనే విషయం తనకు తెలియదని, అధికారం తనకుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని రవికుమార్ తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని టన్నుల యూరియా దారిమళ్లింది, ఎవరు దారి మళ్లించారు, ఎవరు లబ్ధిపొందారనే విషయంపై ప్రస్తుతం విచారణ చేయడం లేదన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండైన ఇద్దరు అధికారుల విధులు, బాధ్యతలు, వారు స్పందించిన తీరు, ఇందులో వారి ప్రమేయం గురించి వివరాలు రాబట్టామన్నారు. వారం రోజుల్లో కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు.