అనంతపురం అగ్రికల్చర్ : గత ఏడాది జూలైలో వెలుగుచూసిన యూరియా కుంభకోణంపై వ్యవసాయ కమిషనరేట్ జేడీఏ శ్రీధర్ గురువారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. క్రిబ్‌కో కంపెనీ నుంచి వచ్చిన 1,300 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు చెందిన మిక్సింగ్ ప్లాంట్‌కు మళ్లించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేశారు. అలాగే కమిషనరేట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ వినయ్‌చంద్ నేతృత్వంలో మరో బృందం రెండు రోజుల పాటు విచారణ చేపట్టి.. కమిషనర్‌కు నివేదిక అందజేసింది. ప్రాథమిక విచారణ తర్వాత వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ - పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ ఎం.రవికుమార్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు.
వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల సస్పెన్షన్‌ను రద్దు చేసి.. పోస్టింగ్ ఇచ్చారు. మల్లికార్జున మడకశిర ఏడీఏగా, రవికుమార్ హిందూపురం ఏడీఏగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ ఇద్దరు అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణకు కమిషనరేట్ జేడీఏ శ్రీధర్‌ను నియమించిన నేపథ్యంలో ఆయన విచారణ మొదలు పెట్టారు. ప్రెజెంటింగ్ అధికారిగా నియమితులైన రైతు శిక్షణ కేంద్రం డీడీఏ డి.జయచంద్ర సమక్షంలో ఏడీఏలు మల్లికార్జున, రవికుమార్‌ను వేర్వేరుగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ఆ ఇద్దరూ విచారణాధికారి ముందు చెప్పినట్లు సమాచారం.
ఎరువులు దారి మళ్లినట్లు తెలియగానే తనిఖీలతో పాటు ప్రాథమిక విచారణ చేశామని మల్లికార్జున చెప్పగా... రేకు ఆఫీసర్ అనే విషయం తనకు తెలియదని, అధికారం తనకుందని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదని రవికుమార్ తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా విచారణాధికారి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని టన్నుల యూరియా దారిమళ్లింది, ఎవరు దారి మళ్లించారు, ఎవరు లబ్ధిపొందారనే విషయంపై ప్రస్తుతం విచారణ చేయడం లేదన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండైన ఇద్దరు అధికారుల విధులు, బాధ్యతలు, వారు స్పందించిన తీరు, ఇందులో వారి ప్రమేయం గురించి వివరాలు రాబట్టామన్నారు. వారం రోజుల్లో కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు.
యూరియా కుంభకోణంపై విచారణ
Published Thu, May 4 2017 11:26 PM | Last Updated on Sat, Aug 25 2018 3:45 PM
Advertisement
Advertisement