కడప అగ్రికల్చర్(వైఎస్సార్ జిల్లా): జిల్లాలో క్షీర విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడి రైతుకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సహకార డెయిరీగా పేరొందిన అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేటు డెయిరీల ఆటకట్టించడంతోపాటు పాడిని నమ్ముకున్న రైతుకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుగా పాలసేకరణ కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలో ప్రారంభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని 127 గ్రామాల్లో రోజుకు 11,200 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. త్వరలో మరో 10 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు కçసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల్లో సర్వేను కూడా పూర్తి చేసినట్లు అమూల్ సిబ్బంది తెలిపారు.
ఏయే మండలాల్లో ఎన్నెన్ని గ్రామాలంటే..
పులివెందుల నియోజక వర్గంలోని చక్రాయపేట మండలంలో 47 గ్రామాల్లో, వేముల మండలంలో 15 గ్రామాల్లో, పులివెందుల మండలంలో 10 గ్రామాల్లో, లింగాల మండలంలో 24 గ్రామాల్లో, తొండూరు మండలంలో 13 గ్రామాలు, సింహ్రాదిపురం మండలంలో 17 గ్రామాల్లో, వీఎన్‌పల్లె మండలంలో ఒక గ్రామం చొప్పున పాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాలు పోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీఆర్‌డీఏ, ఏపీజీబీ బ్యాంకుల ద్వారా చేయూతనందిస్తున్నారు. ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతోపాటు ఇతర మేలు రకం జాతి గేదెలు కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున బ్యాంకు రుణాలను మంజూరు చేయనుంది. అలాగే పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాస విత్తనాలు, దాణామృతం(టీఎంఆర్)లను అందిస్తుంది.
త్వరలో మరిన్ని గ్రామాల్లో .. మూడు బల్క్‌మిల్క్ కలెక్షన్ సెంటర్ల నుంచి..
పులివెందుల నియో జక వర్గం పరిధిలో సేకరిస్తున్న పాలను నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రస్తుతం మూడు బల్క్ మిల్క్ కలెక్షన్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పులివెందుల, లింగాల, చక్రాయపేట మండల కేంద్రాలలో ఉన్న ఈ మూడు సెంటర్లలో ఒక్కో దానిలో 5 వేల లీటర్ల పాలను నిల్వ ఉంచుకునేందుకు వీలుంటుంది. గ్రామాల నుంచి సేకరించిన పాలను ఆయా కలెక్షన్ సెంటర్లలో కూలింగ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మదనపల్లెకు తరలిస్తారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అక్కడి నుంచి పూణేకు ఎగుమతి చేయనున్నారు.
మరో 10 బల్క్ మిల్క్ సెంటర్లు
పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మూడు బల్క్ మిల్క్ కేంద్రాలే కాకుండా మరో 10 బల్క్ మిల్క్ కేంద్రాలను(బీఎంసీ) నిర్మిస్తున్నారు. ఇందులో చిలేకాంపల్లె, వేముల, వేల్పుల, మల్లేల, వెలి దండ్లు, కొరగుంటపల్లె, ఇనగలూరు, పార్నపల్లె, పెద్దకుడాల, కుమారకాల్వ గ్రామాల్లో వీటిని కొత్తగా నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నా యి. ఈ నిర్మాణ పను లు పూర్తయితే పాల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉంది.
పులివెందుల నియోజక వర్గ పరిధిలో ప్రస్తుతం 127 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోంది. త్వరలో మరిన్ని గ్రామాల్లో పాల సేకరణ పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇందుకు సంబం«ధించి సర్వే కూడా నిర్వహించాం.
– వింజమూరి ఉదయకిరణ్, అమూల్ డెయిరీ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్. వైఎస్సార్, చిత్తూరు జిల్లాలు
అర్థికాభివృద్దే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. పాల సేకరణలో దళారీ వ్యవస్థ లేకుండా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
– డాక్టర్ శారదమ్మ, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment