
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించాలని మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒడిశాలోని కోణార్క్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్, పరిశ్రమల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశానికి ఏపీ తరఫున ఆయన హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం గనులు, పరిశ్రమల విషయంలో తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో అపారమైన ఇనుప ఖనిజం వనరులు ఉన్నాయని, కడప ఉక్కు రాష్ట్రానికి ఒక వరంగా మారుతుందని చెప్పారు. దేశంలోనే సుమారు 13 శాతం మ్యాగ్నటైట్ ఇనుప ఖనిజ నిల్వలు ఏపీలో ఉన్నాయని తెలిపారు. ఒక్క అనంతపురం జిల్లాలోని 6 మైనింగ్ రిజర్వుల పరిధిలోనే 110 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయన్నారు. మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ గ్రేడ్‌లను కూడా బెనిఫికేషన్ చేసి, వాటిని ఉక్కు కర్మాగారానికి ముడి ఖనిజంగా వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించాలని కోరారు.
అనంతపురంలోని ఇనుప ఖనిజం లీజులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీ బలోపేతానికి సహకరించాలని కోరారు. గనులకు అనుమతులు ఇచ్చే సమయంలో కనీసం 5 నుంచి 10 సంవత్సరాల కాలయాపన జరుగుతోందని, ఫలితంగా అనుకున్న లక్ష్యం ప్రకారం మైనింగ్ కార్యక్రమాలు జరగడం లేదని చెప్పారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర గనులు, పర్యావరణ మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసి అనుమతుల జారీలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment