గుంటూరు మెడికల్/చిలకలూరిపేట: కనిపించే దైవం వైద్యులేనని.. వారు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో శనివారం ‘డాక్టర్స్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. ‘డాక్టర్స్ డే’లో బీసీ రాయ్‌తో పాటు డాక్టర్ వైఎస్సార్‌ను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆరోగ్యశ్రీతో పాటు 108 అంబులెన్సులు, 104 వాహనాలు తదితర గొప్ప కార్యక్రమాలను ప్రవేశపెట్టి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ‘నాడు–నేడు’ కింద ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నింటినీ అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ వైద్యుడు రోగి ఇంటికే వెళ్లి సేవలందించడం గొప్ప విషయమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో వేలాది ఖాళీలను భర్తీ చేస్తూ.. వైద్యులపై భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. ఇదే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో టీడీపీ పాలనలో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అంతకుముందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నాట్కో ఫౌండేషన్ వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, డాక్టర్లు పొదిల ప్రసాద్, గంగా లక్ష్మి, బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సుధాకర్, రాజేంద్రప్రసాద్, తారకనాథ్, మద్దినేని గోపాలకృష్ణయ్య, మురళీ బాబూరావు, ఫణిభూషణ్, రాజేంద్రప్రసాద్, సుబ్రహ్మణ్యం, కేఎస్‌ఎన్ చారి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు..
ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు, ఎలాంటి ఫీజు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి రజిని చెప్పారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. దేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. మీడియా కూడా సహకరించి ప్రజలకు మేలు కలిగేలా ప్రచారం కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment