Muslim Should Compete With World Says AP CM YS Jagan - Sakshi
Sakshi News home page

ప్రపంచంతో ముస్లింలు పోటీ పడాలి: సీఎం జగన్‌

Published Sat, Nov 12 2022 3:10 AM | Last Updated on Sat, Nov 12 2022 11:56 AM

Muslim Should Compete With World Says AP CM YS Jagan - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ప్రతి ముస్లిం ప్రపంచంతో పోటీ పడి చదవాలి.. గెలవాలి. వీళ్లు గెలవాలంటే కచ్చితంగా చదువు అనే అస్త్రం వీళ్ల చేతుల్లో ఉండాలి. అందుకే చదువుల మీద మన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 135వ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు మీ సోదరుడు, స్నేహితుడు, మీ కుటుంబ సభ్యుడైన మీ జగన్‌ ప్రేమ పూర్వక అస్సలామ్‌ అలైకుమ్‌. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ఈ దేశంలో అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని మనం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీస్‌ వెల్ఫేర్‌ డే (అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం)గా కూడా జరుపుకుంటున్నాం. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప రచయత, పాత్రికేయుడు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆయన విశేష సేవలు అందించారు. అబుల్‌ కలాం జయంతిని మైనార్టీస్‌ డే గా 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి (నాన్నగారు) తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించారు’ అని చెప్పారు.

మైనారిటీ సంక్షేమంలో గొప్ప మార్పు 
ముస్లింల్లో పేదలందరికీ దేశంలోనే తొలిసారిగా ఏపీలో రిజర్వేషన్లు వర్తించిన పరిస్థితులు వచ్చాయంటే అది దివంగత సీఎం వైఎస్సార్‌ వల్లే జరిగింది. ఆ విషయం చెప్పుకోవడానికి ఒక కొడుకుగా గర్వపడుతున్నాను.
నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, ౖమైనారిటీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన కొడుకుగా మీ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాడు. పదవులు, వారికి సంక్షేమం అందించే విషయంలో రాష్ట్రంలో 2019 నుంచి గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని పరిస్థితి. ఈ రోజు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒక మైనారిటీ సోదరుడు ఉన్నారు. మార్పు మీరే గమనించండి. మన పార్టీ నుంచి నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా దేవుడి దయతో గెలిపించుకోగలిగాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమించుకున్నాం.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా అక్క ఇవాళ శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో ఉంది. మైనారిటీ సోదరుడు ఆర్టీఐ చీప్‌ కమిషనర్‌ పదవిలో ఉన్నాడు. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే.. మనసుతో మంచి చేస్తున్నాం అని చెప్పడానికే. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా.

3 ఏళ్ల 4 నెలల కాలంలో..
రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 జూన్‌Œ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు అంటే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో వివిధ పథకాల కింద కేవలం డీబీటీ విధానంలో బటన్‌ నొక్కి నేరుగా  అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి లంచాలు, వివక్ష లేకుండా నగదు జమ చేస్తున్నాం. వ్యవస్థలో గొప్ప మార్పు చోటుచేసుకుంది. 
ఈ మూడేళ్ల 4 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా 44,13,773 మైనారిటీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రూ.10,309 కోట్లు జమ చేశాం. నాన్‌ డీబీటీ ద్వారా మరో 16,41,622 మైనార్టీ కుటుంబీకులకు మరో రూ.10 వేల కోట్లు లబ్ధి చేకూర్చాం. 2,42,226 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. 1,36,888 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఇళ్లు కూడా మంజూరు చేశాం. అవి నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా ఒక్క ఇళ్లకు సంబంధించి మాత్రమే రూ.9,400 కోట్లు వీరి చేతిలో పెట్టగలిగాం.
టీడీపీ హయాంలో 2014–19 వరకు ఐదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు కేవలం రూ.2,665 కోట్లే. మన ప్రభుత్వంలో ఏకంగా రూ.20 వేల కోట్ల లబ్ధి. అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా ఉందో పోల్చి చూడండి.

వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు పటిష్ట చర్యలు 
వక్ఫ్‌ బోర్డు ఆస్తులను సంరక్షించాలని ప్రతి అడుగు సిన్సియర్‌గా వేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 65,783 ఎకరాల వక్ఫ్‌ భూములుండగా.. పలుచోట్ల అవి అన్యాక్రాంతమైనట్లు కనిపిస్తున్నాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం తిరిగి వక్ఫ్‌కు స్వాధీనం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. 
ఇప్పటికే అన్యాక్రాంతమైన వాటిలో 580 ఎకరాల భూమిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాధీనం చేసుకుని వక్ఫ్‌కు తిరిగి ఇచ్చాం. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. ఇప్పటివరకు 3,772 ఆస్తులకు సంబంధించి డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సర్వే పూర్తి చేసి, వాటిని కంచె వేసి రక్షించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 

గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.287 కోట్లు 
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అడిగిన విధంగా గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.287 కోట్లు ఇప్పటికే మంజూరు చేశాం. అరండల్‌పేట శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ఆర్వోబీ నిర్మాణం రూ.131 కోట్లతో త్వరలోనే ప్రారంభం అవుతుంది. గుంటూరు వెస్ట్‌లో ముస్లిం కౌన్సెలింగ్‌ హాల్‌ కమ్‌ లైబ్రరీ సెంటర్‌ కూడా మంజూరు చేస్తున్నా. 

ముస్లిం ప్రముఖులకు అవార్డుల ప్రదానం 
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జాతీయ పురస్కారాన్ని అనంతపురానికి చెందిన ప్రొఫెసర్‌ కె ముజఫర్‌ ఆలీకి  సీఎం వైఎస్‌ జగన్‌ అందజేశారు. కర్నూలుకు చెందిన సయ్యద్‌ అరిఫుల్లా బాషా కాద్రీకి డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ రాష్ట్రీయ పురస్కారం, రూ.లక్ష నగదు బహుమతిని అందించారు. హజ్రత్‌ షా కమాల్‌ పురస్కారాన్ని కడపకు చెందిన అఫ్సర్‌ డెక్కానికి, అల్లమల యాసీర్‌ కుములిన్‌ పురస్కారాన్ని అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్‌ మహమ్మద్‌ హషిమ్‌కు, సలామన్‌ అతార్‌ జావీద్‌ అవార్డును కర్నూలుకు చెందిన డాక్టర్‌ మహమ్మద్‌ సిద్దిఖీకి, దుర్వేష్‌ కాద్రీ జాకి పురస్కారాన్ని అన్నమయ్య జిల్లాకు చెందిన డాక్టర్‌ పి దావూద్‌ఖాన్‌కు, షాఫిల్‌ఫోర్‌ కాద్రీ అవార్డును కడపకు చెందిన డాక్టర్‌ సయ్యద్‌ అమ్జాద్‌ అలీకి, మిర్జాఫైక్‌ తుర్కామని అవార్డును గుంటూరుకు చెందిన డాక్టర్‌ సయ్యద్‌ మస్తాన్‌ వలీకి, యూసఫ్‌ సఫీ అవార్డును చిత్తూరుకు చెందిన డాక్టర్‌ పి అబ్దుల్‌ గఫార్‌కు అందజేశారు. వీరికి రూ.25 వేల  నగదు కూడా అందజేశారు. 

2019 నుంచి ముస్లింలకు సువర్ణ అధ్యాయం 
రాష్ట్రంలో 2019 నుంచి మైనార్టీలకు సువర్ణ అధ్యాయం. రాష్ట్రంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే, జగన్‌ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పెంచిన గౌరవ భృతిని చెల్లిస్తోంది. ఇది మైనారిటీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించిన ప్రభుత్వం. రెండో అధికార భాషగా ఉర్దూ్దకు చట్టబద్ధ్దత కల్పించడంతో పాటు అమలుకు చర్యలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనారిటీల సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాం.    
– అంజాద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement