తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ
ఏపీ నుంచి అర్హత సాధించిన 43,788 మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తాత్కాలిక షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి స్ట్రే వేకెన్సీ రౌండ్‌కౌన్సెలింగ్‌ను ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అక్టోబర్1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
నీట్ యూజీ–2024 తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల సవరించిన మార్కులు, ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 64,299 మంది విద్యార్థులు నీట్ రాయగా 43,788 మంది అర్హత సాధించారు. జూన్ 4 తేదీ నాటి ఫలితాలతో పోలిస్తే ఏపీలో 70 మంది విద్యార్థులు అనర్హులుగా మారారు.
రాష్ట్రం నుంచి నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఎన్టీఏ నుంచి వైఎస్సార్ విశ్వవిద్యాలయానికి రావాల్సి ఉంది. వర్సిటీ ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి ఈ సమాచారం తీసుకుని రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ఇక ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభమైన అనంతరం రాష్ట్రస్థాయిలో వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment