గుంటూరుకు చెందిన రవిచంద్ర కాలేజీ నుంచి వస్తూ కింద పడి గాయం కావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా.. అటు నుంచి అటే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నాడు. ఆ తర్వాత చిన్నపాటి జ్వరం వస్తే దానికి మరో యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ తీసుకున్నాడు. ఇలా చీటికిమాటికి యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల.. ఆ తర్వాత ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వేసుకున్న మందులు.. సరైన ప్రభావం చూపించకపోవడంతో చివరకు వైద్యుడిని సంప్రదించాడు. యాంటీ బయోటిక్స్ అతిగా వాడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడైంది. బ్యాక్టీరియా కూడా మందులకే సవాల్ విసిరేంత శక్తిని సంతరించుకున్నట్లు తేలింది. ఇలా.. యాంటీ బయోటిక్స్ మితిమీరి వాడటం ద్వారా అనేక మంది తమ ఆరోగ్యాలను చేజేతులారా పాడుచేసుకుంటున్నారు.
సాక్షి, అమరావతి: యాంటీ బయోటిక్స్ మందులు విచ్చలవిడిగా వాడటం వల్ల చివరికి అవే విషంలా మారుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా యాంటీ బయోటిక్స్ వాడకం పెరిగిపోయింది. దీని వల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలకూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(యాంటీ బయోటిక్స్ ఎక్కువ వాడటం వల్ల బ్యాక్టీరియా బలం పుంజుకోవడం)పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో ఏటా సుమారు 2 కోట్ల మంది యాంటీ బయోటిక్స్ మందులను వాడుతున్నారు. వీరిలో అత్యధిక మంది మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు తేలింది. బ్యాక్టీరియా బలం పుంజుకుంది మొండి జబ్బులకు కూడా దివ్యౌషధంగా భావించేది యాంటీ బయోటిక్స్ మందులే.
అయితే మితిమీరిన వాడకం వల్ల బాక్టీరియా కూడా బలం పుంజుకుని యాంటీ బయోటిక్స్‌కు సవాల్ విసిరేంత శక్తి సంతరించుకుంటోంది. చిన్నపాటి జ్వరం వస్తే యాంటీ బయోటిక్ మాత్ర లేదా ఇంజక్షన్ వేస్తున్నారు. తర్వాత జ్వరం తీవ్రంగా వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన డోసు సరిపోవడం లేదు. ఇలా యాంటీ బయోటిక్ డోసు పెంచుకుంటూ పోయి.. చివరకు రోగమే పై చేయి సాధించేలా పరిస్థితి తయారైంది. దీనిపై దృష్టి సారించకపోతే జబ్బులను నియంత్రించడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మందులపై నియంత్రణ
యాంటీ బయోటిక్స్ మందులను రేషనలైజేషన్ చేయనున్నారు. మనుషులకు సంబంధించే కాకుండా.. చేపలు, పౌల్ట్రీ, వెటర్నరీ తదితరాల్లో వినియోగించే మందులపైన కూడా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఏ జబ్బుకు.. ఎలా? ఎవరు? ఇవ్వాలో నిర్ణయించనున్నారు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు నార్కోటిక్(మత్తు) మందులపైనే నియంత్రణ ఉండేది. ఇకపై డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ ఇవ్వడానికి కూడా వీలుండదు. ఇష్టారాజ్యంగా మందులు రాసే వైద్యులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్ మందులిచ్చిన షాపులపైనా చర్యలు తీసుకుంటారు. యాంటీ బయోటిక్ వాడి రోగ నిరోధక శక్తి కోల్పోయిన రోగుల నమూనాలను ల్యాబొరేటరీల్లో నిర్ధారించి.. వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటారు.
నిపుణులతో కమిటీ..
యాంటీ బయోటిక్స్ నియంత్రణ కోసం నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ, అగ్రికల్చర్, పశుసంవర్థక, డైరీ అండ్ ఫిషరీస్, పర్యావరణ, ఫారెస్ట్, ఫార్మాస్యుటికల్/డ్రగ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డ్రింకింగ్ వాటర్, ఆయుష్ తదితర విభాగాల నిపుణులుంటారు. నోడల్ అధికారిగా ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ వ్యవహరిస్తారు.
ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇవ్వాలి..
మెడికల్ షాపుల వాళ్లు రోగులకు ప్రిస్కిప్షన్ ఉంటేనే మందులివ్వాలి. ఇష్టమొచ్చినట్టుగా ఇవ్వడం వల్ల.. కోర్సు మొత్తం పూర్తి చేయకుండా కొంతమంది 2 మాత్రలు వాడి తగ్గగానే మానేస్తున్నారు. ఆ తర్వాత అవి వాడితే పనిచేయట్లేదు. ఇచ్చే మందులు, ప్రిస్కిప్షన్‌తో ఆన్‌లైన్ లింక్ చేయాలి. ప్రతిదీ ప్రిస్కిప్షన్‌కు లింక్ చేసి, మందులకు సంబంధించి వైద్యుడిని బాధ్యుడిని చేస్తే నియంత్రణ చేయచ్చు. కౌంటర్ సేల్ జీరో చేయాలి.
– డా.కె.రాంబాబు, కింగ్ జార్జి ఆస్పత్రి, విశాఖ
కార్యాచరణ రూపొందిస్తున్నాం
ఔషధ నియంత్రణ శాఖ డీజీ ఆధ్వర్యంలో వివిధ భాగస్వామ్యులతో దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగంపై నియంత్రణ దిశగా ఈ కార్యాచరణ ఉంటుంది.
– ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధ నియంత్రణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment