నాసిన్‌లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు
పెనుకొండ: నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ డ్యూటీస్ అండ్ నార్కొటిక్స్) ఏర్పాటుతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2024 నాటికి నాసిన్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ప్రత్యేక అభిమానమని, ఒక తండ్రిలా ఆప్యాయంగా సీఎంని పలకరిస్తారని చెప్పారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ‘నాసిన్’ భవన సముదాయానికి భూమిపూజ శనివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చక్కటి వాతావరణంలో ఎంతో సుందరంగా నాసిన్ రూపుదిద్దుకోబోతోందని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూలు, మత్తు పదార్థాల నిర్మూలన విస్తృతంగా చేపడతామన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే విధంగానే ఇక్కడి నాసిన్‌లో ఐఆర్‌ఎస్‌లకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కస్టమ్స్ ఉద్యోగులు అకాడమీకి అనుసంధానమై ఉంటారన్నారు.
నాసిన్ ఏర్పాటుకు సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అకాడమీతో పాలసముద్రం, హిందూపురం ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఒక్క పాలసముద్రం గ్రామానికి రూ. 729 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి నాసిన్ అకాడమీలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కేంద్ర రెవెన్యూ సెక్రటరీ తరుణ్‌బజాజ్, సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రీ, మెంబర్ సంగీత శర్మ, నాసిన్ డీజీ ఎస్‌ఆర్ బరూహ్, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, కలెక్టర్ నాగలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment