ఏపీ ప్రకృతి వ్యవసాయ విధానాలను తెలుసుకుంటున్న ఎన్‌ఆర్‌ఐలు
ఇక్కడి విధానాలతో అమెరికాలో సాగు చేసేలా ప్రణాళికలు
గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తపుంతలు తొక్కిన ప్రకృతి వ్యవసాయం
పిఠాపురం: రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ సాగులో ముందడుగు వేసిన ఏపీ రైతులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇతర దేశాల చూపు పడింది. రసాయనాలతో సహజత్వం కోల్పోయిన భూముల్లో తిరిగి సత్తువ పెంచేందుకు మన రైతులు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు. రసాయనాల వాడకంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు చేసిన కృషి ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తోంది.
గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రకృతి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల ప్రతినిధులు, ఆయా దేశాల్లోని ఔత్సాహిక రైతులు మన రాష్ట్రానికి వచి్చన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐల రాకతో కాకినాడ జిల్లాలో మారుమూల గ్రామమైన గొల్లప్రోలు మండలం దుర్గాడ వస్తున్నారు.
ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారో తెలుసుకుని.. ఏయే సందర్భాల్లో వాటిని వినియోగించాలని, ప్రకృతి సాగు ఎలా చేయాలనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది
మాది ఆంధ్రప్రదేశ్. నా చిన్నతనంలోనే అమెరికాలో సెటిలయ్యాం. అమెరికాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంది. రసాయనాలు వాడని వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే కొనడానికి ఇక్కడివారు ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి అమెరికాలో ఈ తరహా పంటలను పండించేందుకు ప్రయతి్నస్తున్నాం. అందుకే.. దుర్గాడ గ్రామానికి వచ్చాం.
ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారు. బయో ఇన్‌పుట్ సెంటర్లు నిర్వహిస్తూ ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సైతం మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గత ఐదేళ్ల నుంచే ప్రకృతి వ్యవసాయం పెరిగిందని రైతులు చెప్పారు. – ఎన్.దేవి, ఎన్‌ఆర్‌ఐ, కాలిఫోర్నియా, అమెరికా
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగింది
గత ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాం. ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభించి వివిధ రకాల పద్ధతులతో నిత్యం ఆదాయం వచ్చేవిధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. శాస్త్రవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు మమ్మల్ని సంప్రదించి ప్రకృతి వ్యవసాయ సాగు వివరాలు తెలుసుకుంటున్నారు.
మా గ్రామంలో బయో ఇన్‌పుట్ సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నాం. మా ప్రాంతంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు విదేశీయులు రావడం గర్వకారణం. – గుండ్ర శిశచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ
విదేశీ ప్రతినిధులు వస్తున్నారు
కాకినాడ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం, జీవ ఉ్రత్పేరకాలు, బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ని కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, మీనామృతం, చిల్లీ స్పెషల్ కషాయం, లింగాకర్షణ బుట్టలు, ఎల్లో–బ్లూ స్టిక్కీ ప్లేట్స్, పీఎండ్స్ (నవధాన్యాల విత్తనాలు) ఎలా తయారు చేస్తారనే విషయాలపై ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐలు దుర్గాడ వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు విదేశీయులు త్వరలో రానున్నారు.
– ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment