‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ | One End Life In Annamayya | Sakshi
Sakshi News home page

‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’

Published Mon, Mar 17 2025 9:46 AM | Last Updated on Mon, Mar 17 2025 1:20 PM

One End Life In Annamayya

చెట్టుపై నుంచి పడి తండ్రి మృతి 

పదేళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి వెళ్లిన భార్య 

అన్నమయ్య: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. 

గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్‌ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్‌ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్‌ పరీక్షలకు సమాయత్తమవుతోంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement