ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి బ్యూరో: గతంలో వివాహానికి ఆహ్వానించాలంటే బంధువులు, మిత్రుల ఇళ్లకు వెళ్లి పెళ్లి పత్రికలు అందజేసి కుటుంబ సమేతంగా విచ్చేయమని కోరేవారు. పెళ్లికి నెల రోజుల నుంచే పెళ్లి పత్రికల పంపిణీ మొదలుపెట్టేవారు. ఎవరెవరికి పత్రికలు ఇవ్వాలో కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏ ఒక్క పేరు మరచిపోకుండా రాసుకొని మరీ ఆహ్వానించేవారు. పిలుపులను గౌరవించిన ఆహ్వానితులు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి పెళ్లి తంతును తిలకించి, దంపతులను ఆశ్వీరదించి, విందు ఆరగించి వచ్చేవారు. కరోనా మహమ్మారి, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిళ్లు మొత్తం ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొత్త పుంతలు తొక్కుతున్న వివాహ వేడుకలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
వాట్సాప్‌లో ఆహ్వానం..
వివాహ ఆహ్వాన పత్రికలు ఇది వరకు శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలయ్యేవి. ఇప్పుడు హాయ్... అంటూ వాట్సాప్‌లో సందేశాల రూపంలో మొబైల్‌లోకి వచ్చిపడుతున్నాయి. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వధూవరుల ఫొటోలు, కల్యాణ వేదిక, సమయం వివరాలతో డిజైన్ చేయిస్తున్నారు. చాలామంది ప్రీవెడ్డింగ్ షూట్ జరిపి, వాటితోనే వీడియో రూపంలో ఆహ్వానం పంపుతున్నారు. పెళ్లి కార్డులు పంపిణీ చేస్తే వాటిలో క్యూ ఆర్ కోడ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే వీడియో రూపంలో ఉన్న ఆహ్వానం, వేదిక, ప్రత్యక్ష ప్రసారాల వివరాలు తెలుసుకోవచ్చు.
గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ షేర్..
ఆకాశమంత పందిరి వేసి, భూమి అంత ముగ్గుతో ఆహ్వానం పలికే పెళ్లి ఇళ్లు గతంలో కనిపించేవి. బంధువులు, స్నేహితులకు ఆహ్వానితుల ఇళ్లు తెలియకపోయినా సందడి వాతావరణాన్ని చూసి పెళ్లి ఇంటికి చేరుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆహ్వానితుల వేదిక వద్దకు సులువుగా చేరుకోవడానికి వీలుగా గూగుల్ మ్యాప్ సహాయంతో లొకేషన్‌ను షేర్ చేస్తున్నారు. ఈ లొకేషన్ ఆధారంగా పెళ్లికి హాజరుకావాల్సిన వారు సులువుగా చేరుకొనే వీలుంది. ఆహ్వాన పత్రికలు, వాట్సాప్ సందేశాలలో గూగుల్ మ్యాప్ లొకేషన్‌ను తప్పకుండా ఉంచుతున్నారు. మరోవైపు ముఖ్యమైన బంధువులు, స్నేహితులలో ప్రత్యేకంగా ఫలానా ఇంటి వారి పెళ్లి అంటూ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిశ్చితార్థం మొదలు పెళ్లి ముగిసేవరకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఎప్పుడు వేదిక వద్దకు చేరుకోవాలి, ప్రత్యేకంగా అందరూ ఒకే విధమైన దుస్తులు ధరించడం, పెళ్లిలో తీసిన ఫొటోలు షేర్ చేయడం వంటివి ఈ గ్రూప్‌ల వేదికగా జరుగుతున్నాయి.
ప్రత్యక్ష ప్రసారాలు..
కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లకు ఎక్కువ సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానించడానికి వీలులేకుండా పోయింది. పిలిచినా వెళ్లడానికి సంశయిస్తున్న సమయం. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించి పెళ్లి తంతును మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా హాజరు కావాలని కోరుకుంటున్నప్పటికీ కరోనా దృష్ట్యా వీలుపడం లేదని, ఆన్‌లైన్‌లో వీక్షించి.. మా నవదంపతులను మనసారా దీవించండి అంటూ పెళ్లింటి వారు కోరుతున్నారు. పెళ్లి కుమార్తె మండపానికి రావడంతో మొదలు, మాంగల్యధారణ, బంధుమిత్రుల ఆశీర్వచనాలు, విందుభోజనాల వరకు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేసేస్తున్నారు. మొబైల్ ఫోన్లకు లైవ్ లింకులను ప్రత్యేకంగా పంపుతున్నారు. తమకు ఇష్టమైన వారు పెళ్లికి హాజరుకాలేదన్న దిగులు లేకుండా పోతోంది. లైవ్‌లో చూస్తున్న వారు వధూవరులను నిండుమనసుతో ఆశీర్వదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment