
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రామ సుబ్బమ్మకు పింఛన్ అందిస్తున్న వైఎస్సార్ జిల్లా తలముడిపి వలంటీరు అలీ
సాక్షి, అమరావతి: తొలిరోజు పంపిణీకి వీలు కాని పింఛనుదారులకు బుధవారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. బుధవారం నాటికి మొత్తం 59,16,290 మందికి పంపిణీ పూర్తి కాగా, రూ.1436.78 కోట్లు అందజేశారు. రెండో రోజుకు మొత్తం పింఛనుదారుల్లో 95.89 శాతం మందికి డబ్బులు చేరాయి. గురువారం కూడా వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తారని సెర్ప్ అధికారులు వెల్లడించారు.
పరిమళించిన మానవత్వం
గాలివీడు/ఒంగోలు టౌన్: మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామాలకు రాలేని ఇద్దరు వృద్ధుల పింఛను రద్దయ్యే నేపథ్యంలో.. స్థానికులు, స్థానిక వలంటీర్లు మానవత్వంతో బాసటగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తలముడిపికి చెందిన రామసుబ్బమ్మ అనారోగ్యంతో మూడు నెలల క్రితం కర్ణాటకలోని ఉడిపి మండలం కొలంబిలో ఉంటున్న తన కూతురింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఇక్కడికి రాలేకపోయింది. మూడు నెలలు కావస్తుండడంతో వృద్ధాప్య పింఛన్ రద్దయ్యే అవకాశం ఉందని గ్రామ వలంటీరు ఆలీ అహమ్మద్ బాషా స్థానికులకు తెలిపాడు. దీంతో కొంతమంది స్పందించి టికెట్‌కయ్యే ఖర్చులో కొంతమొత్తాన్ని వలంటీర్‌కు అందజేశారు.
ఆ మొత్తంతోపాటు వలంటీర్ మరికొంత మొత్తం భరించి మంగళవారం కర్ణాటకలోని వృద్ధురాలు ఉంటున్న ఇంటికి వెళ్లి మూడు నెలల పింఛన్‌ను అందజేశాడు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గాంధీనగర్ వార్డుకు చెందిన దేవరపల్లి రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నది. మూడు నెలలుగా పింఛను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక వలంటీర్ పాలపర్తి డేవిడ్ విషయాన్ని సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సుబ్బయ్యశర్మకు వివరించాడు. దీంతో ఆయన తన సహచర సెక్రటరీలతో మాట్లాడి డేవిడ్ ప్రయాణానికి అవసరమైన నగదు సమకూర్చారు. వలంటీర్ డేవిడ్ బుధవారం హైదరాబాద్ వెళ్లి ఆ వృద్ధురాలికి అందాల్సిన నాలుగు నెలల పింఛన్‌ను అందజేశాడు. దీంతో ఆ వృద్ధుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వలంటీర్లను పలువురు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment