పార్వతీపురంలో భారీ ర్యాలీలో పాల్గొన్న నేతలు
సాక్షి నెట్‌వర్క్: నూతన జిల్లాల ఏర్పాటు చేయడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పార్వతీపురం చేరుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ నినదించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, అరకు సంతబయలులో ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ పుట్టపర్తిలో సంబరాలు జరిగాయి.
వేలాది మంది విద్యార్థులు, డప్పు కళాకారులు, ప్రజలు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కార్యాలయం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు నుంచి పలు గ్రామాల మీదుగా నందికొట్కూరు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ‘సీఎం సార్.. థ్యాంక్యూ సార్’ అంటూ ప్రజలు నినదించారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. వారం రోజులపాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. జిల్లాల పునర్విభజన, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ విజయవాడ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గూడూరు, కోడూరుతోపాటు వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, సింహాద్రి రమేష్, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శనలు, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, టెక్కలి, నందిగామ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావు, సీడాప్ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో భారీఎత్తున సంబరాలు నిర్వహించారు. చోడవరం, అడ్డరోడ్డు, రాంబిల్లి తదితర ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, జెడ్పీటీసీ విజయశ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చిత్రపటానికి స్థానికులు క్షీరాభిషేకం నిర్వహించారు.
భీమవరంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉండి, ఆకివీడు మండలం కుప్పనపూడి, కొయ్యలగూడెం, పోలవరం తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు బొమ్మల సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తిరుపతిలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు క్షీరాభిషేకం చేశారు. భారీ కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment