ముగ్గురి మాటే శాసనం | Police department in retired IPS officers hands | Sakshi
Sakshi News home page

ముగ్గురి మాటే శాసనం

Published Mon, Jul 15 2024 4:13 AM | Last Updated on Mon, Jul 15 2024 1:09 PM

Police department in retired IPS officers hands

రిటైర్డ్‌ ఐపీఎస్‌ల గుప్పిట్లో పోలీసు శాఖ

ఏబీవీ, ఆర్పీ ఠాకూర్, ఘట్టమనేని శ్రీనివాస్‌లే అసలు బాస్‌లు

పోలీసు శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత.. వీరి సర్వీసు అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే

ఎస్సై నుంచి డీజీ వరకు వారి మాటే వేదం

ఆ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగులు.. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి.. వేధించాలి

మూటలు ఇవ్వాలి.. వారి మాటే వినాలి

ఇవన్నీ చేస్తేనే పోస్టింగులు

వారు సంతృప్తి చెందితేనే చిన బాబు, పెద్ద బాబు వద్దకు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పోలీసు శాఖలోకి రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయి. రిటైరైపోయిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల గుప్పిట్లో పోలీసు శాఖ చిక్కుకుంది. రిటైర్డ్‌ డీజీ ఏబీవీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ల మాటే శాసనంగా చలామణి అవుతోంది.

సర్వీసు మొత్తం అత్యంత వివాదాస్పదంగా ముద్రపడ్డ ఈ ముగ్గురూ ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో పోలీసు శాఖపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈ అధికారులు ఎస్సై నుంచి డీజీపీ స్థాయి అధి కారిని కూడా శాసిస్తున్నారు. వారి ప్రాపకం పొందిన అధికారులకే పోస్టింగులు ఇస్తున్నారు. 

వారు చెప్పి నట్టల్లా ఆడాలని, చెప్పిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని షరతులు పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకొన్న వారికే సీఎంవో కటాక్షం లభించి, పోస్టింగులు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు శాఖలో ఈ ముగ్గురి మాటే శాసనం.

సర్వీసు అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే..
ఈ ముగ్గురు అధికారుల సర్వీసు మొత్తం వివాదాస్పదమే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు  వీరు చెలరేగిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. ఆశ్రిత పక్షపాతం, రాజకీయ కక్ష సాధింపులతో ఫక్తు రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరించారు. వీరిలో డీజీ హోదాలో ఇటీవల రిటైరైన ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు అంతా అత్యంత వివాదాస్పదం. 

గతంలో నిఘా విభాగం అధిపతిగా చేసినప్పుడు వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడం, ప్రలోభాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ప్రధాన పాత్రధారి. టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఈయన ఏకంగా కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాలను కొనడం సంచలనం సృష్టించింది.

 

తన కుమారుడి కంపెనీ ద్వారా పెగాసస్‌ కంపెనీ స్పైవేర్‌ను అక్రమంగా కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ కొన్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర శాసన సభలోనే చెప్పడం సంచలనం రేపింది.

» పూర్వపు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అవినీతి, వివాదాలకు మారుపేరుగా ముద్ర పడ్డారు. ఆయన రాయలసీమలో పని చేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో అంటకాగి శాంతి భద్రతలను గాలికొదిలేశారు. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే.. డీజీపీగా ఉన్న ఠాకూర్‌ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏకపక్షంగా ఆ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

అప్పటి రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా ఉన్న ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ఇంత చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సీనియారిటీని గౌరవించి కీలక పోస్టింగులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా గౌరవనీయమైన పోస్టులో రిటైరయ్యే అవకాశం కల్పించింది. రిటైరైన తరువాత కూడా కీలక పదవిలో నియమించింది. ఆయన మాత్రం పచ్చ రాజకీయ వాసనలను వీడలేదు. 

ఇటీవలి ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసి మరీ ఆ పార్టీ కోసం పని చేశారు. పోలీసు అధికారులను బెదిరించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేందుకూ సాహసించారు. ఎన్నికల్లో టీడీపీ అక్రమాల కుట్రలో కీలకంగా వ్యవహరించారు. డీఐజీ స్థాయిలో రిటైరైన ఘట్టమనేని శ్రీనివాస్‌ గత ఐదేళ్లుగా టీడీపీ బ్యాక్‌ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ కేంద్రంగా పని చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీని ఆయనే పర్యవేక్షించారు.

ఇవిగో ఉదాహరణలు
రాజధాని ప్రాంతంలో కీలక జిల్లా పోలీసు అధికారి పోస్టు ఆశించిన ఓ ఐజీ స్థాయి అధికారిని కొన్ని రోజుల క్రితం వీరు పిలిపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరెవరి మీద ఎక్కడెక్కడ అక్రమ కేసులు ఎలా పెట్టవచ్చో ఒక లిస్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం తాము పెట్టిస్తున్న అక్రమ కేసులను పర్యవేక్షించాలని, జిల్లా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో మాట్లాడుతూ కేసుల నమోదు, వేధింపులు వేగవంతం చేసేట్టు చూడాలని కూడా చెప్పారు. 

తాము సంతృప్తి చెందితే ఆయన ఆశించిన కీలక పోస్టింగ్‌ ఇస్తామని షరతు విధించారు. దాంతో ఆ అధికారి వారు చెప్పిన పని చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల మీద అక్రమ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన పనితీరుతో ఆ ముగ్గురు రిటైర్డ్‌ అధికారులు సంతృప్తి చెంది పచ్చ జెండా ఊపారు. దాంతో ప్రభుత్వం ఆయనకు రాజధాని ప్రాంతంలో కీలక పోలీసు అధికారిగా పోస్టింగ్‌ ఇచ్చింది.

» ఇటీవలి ఎన్నికల్లో గుంటూరులో అత్యంత వివాదాస్పద అధికారిగా మారిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కూడా పోస్టింగ్‌ కోసం వీరి వద్దకు వచ్చారు. ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశాను కాబట్టి కీలక పోస్టింగ్‌ కావాలని కోరారు. ఆయనకు కూడా ఇదే విధమైన షరతు విధించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడితో ఏమాత్రం సంబంధం లేని వారిని ఆ కేసులో ఇరికించాలని, వేధించాలని చెప్పారు. అలా చేస్తేనే మరింత ప్రాధాన్యమున్న పోస్టింగ్‌ ఇస్తామని చెప్పారు. 

» జిల్లాల ఎస్పీలతో సహా శనివారం బదిలీ చేసిన 37 మంది ఐపీఎస్‌ జాబితా తయారు చేసిందీ ఈ ముగ్గురే. ఇటీవలి ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించి తీవ్ర వివాదాస్పదమైన బిందుమాధవ్‌ నాయుడును కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించారు. 

టీడీపీ సీనియర్‌ నేతకు సమీప బంధువైన కోయ ప్రవీణ్‌ను కర్నూలు రేంజ్‌ డీఐజీగా నియమించారు. టీడీపీకీ అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారని పేరు బడ్డ దామోదర్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఐపీఎస్‌ల నియామ కాలన్నీ ఈ ముగ్గురు రిటైర్డ్‌ అధికారుల ఎంపిక మేరకే చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

చెప్పినట్లు చేస్తేనే పోస్టింగులు
ఈ ముగ్గురికీ ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్‌ పద­వులు, ఇతరత్రా అధికారిక హోదా ఏదీ ఇవ్వలేదు. అయినా వారు చెప్పిందే చేయాలని ముఖ్య నేత పోలీ­సు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తద్వారా పోలీసు శాఖను ఈ ముగ్గురే నియంత్రిస్తారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురూ చెలరేగిపోతున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచేసుకుని ఎస్సై నుంచి డీజీపీ వరకూ యావత్‌ పోలీసు వ్యవస్థనే గుప్పిట్లోకి తీసుకున్నారు. 

జిల్లా ఎస్పీలు, డీఐజీల పోస్టింగులు అన్నీ వీరే ఖరారు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీల ప్రక్రియ సాగుతోంది. శనివారం 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీలు, అంతకుముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలన్నీ ఈ ముగ్గురి ఎంపిక మేరకే జరిగాయి. వీరు ముగ్గురూ  ఐపీఎస్‌ అధికారులను పిలిపించుకుని మాట్లాడి సంతృప్తి చెందిన తరువాతే వారి ఫైళ్లు ముందుకు కదిలాయి. అనంతరమే పెద్ద బాబు, చిన బాబు ఆమోదముద్ర వేశారు. 

ఐపీఎస్‌లే కాదు.. సీఐల పోస్టింగులు కూడా వీరి కనుసన్నల్లోనే సాగు­తున్నాయి. ఐపీఎస్‌ నుంచి సీఐ వరకు పోస్టింగులకు రేటు కూడా ఫిక్స్‌ చేస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎలా పెడతారు? ఎలా వేధిస్తారు? అంటూ పోస్టింగులకు ముందు అధికారులను వీరు ముగ్గురూ ప్రశ్నిస్తున్నారు. తాము సంతృప్తి చెందితేనే పోస్టింగుల జాబితాలో వారి పేరు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన బదిలీలన్నీ అదే ప్రాతిపదికన చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement