సాక్షి, అమరావతి : ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది. 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
2020 జనవరి 1నుంచి పీఆర్సీ అమలు
ప్రభుత్వంలో విలీనమైన 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకానుంది. ఇచ్చిన హామీ ప్రకారం మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లలో వారికి మాస్టర్స్ స్కేల్స్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. 23 శాతం ఫిట్‌మెంట్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్) ఎలా నిర్ధారించాలో అందులో పేర్కొంది. 2018 జూలై, 2020 జనవరి మధ్య ఆర్టీసీలో చేరిన ఉద్యోగులకు పే స్కేల్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది. పెన్షన్, గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎలా వర్తింపజేయాలో కూడా సూచించింది. ట్రావెలింగ్ ఇతర అలవెన్సులకు సంబంధించి మరో జీఓ ఇచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లకు వారి డ్యూటీల ప్రకారం ఇచ్చే అలవెన్సులను నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment