సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దసరా వచ్చిందయ్యా.. పరిపాలన రాజధాని తెచ్చిందయ్యా అంటూ విశాఖ నగరం అందంగా ముస్తాబవుతోంది! వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారులకు నివాస భవనాలను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. హిల్–3లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాలను అధికారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు చివరినాటికి నిర్మాణం పూర్తయ్యే పలు భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
తుది దశ భవనాల వివరాల సేకరణ
విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగుల మేర ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేట్ భవనాలను కూడా గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
ప్రధానంగా రానున్న రెండు నెలల్లోగా పూర్తయ్యే భవనాలపై దృష్టి సారించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు స్థానిక సచివాలయాల ద్వారా ఈ వివరాలను సేకరిస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత మేర ఉంటుందనే వివరాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు అందుబాటులోకి వచి్చన తర్వాత వాటిని లీజుకు తీసుకుని ఏయే విభాగాలను ఏర్పాటు చేయవచ్చనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న అదనపు విస్తీర్ణం ఎంత? అక్కడ ఏ విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది? అనే వివరాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment