
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పా శ్రీవాణికి కొద్ది రోజుల కిందట పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించడంతో మహాలక్ష్మి తమ ఇంట్లో అడుగుపెట్టిందని పుష్ప శ్రీవాణి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మేరకు పుష్పా శ్రీవాణి-పరీక్షిత్ రాజు దంపతులు తమ ముద్దుల కూతురితో కలిసి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. పాపకు తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా ఇటీవల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ దంపతులను ఎమ్మెల్యే రోజా కలిసిన విషయం విదితమే. స్వయంగా పుష్ప శ్రీవాణి ఇంటికెళ్లి తమ చిన్నారికి ఆశీస్సులు అందించారు.
ఇక పుష్ప శ్రీవాణిది పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం. 2014లో శతృచర్ల పరీక్షిత్ రాజుతో వివాహమైంది. భర్త వైఎస్సార్‌సీపీ అరకు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు (2014,2019) విజయం సాధించారు. 2019లో 26 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ కేబినెట్‌లో ఆమెకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. కేబినెట్‌లో కూడా పుష్ప శ్రీవాణి అత్యంత పిన్న వయస్కురాలు.
చదవండి: ఎక్కడా రాజీపడొద్దు: సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment