సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ కమిటీ బృంద సభ్యులు కితాబిచ్చారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బృందం స్టడీ టూర్‌లో భాగంగా రెండు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ కన్వినర్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అధ్యక్షతన రాష్ట్రంలో ఎరువులు లభ్యత, పంపిణీ తదితర అంశాలపై శనివారం కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీలోని పలువురు ఎంపీలు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను సందర్శించామని, వాటి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు దేవాలయాలతో సమానంగా ఆర్‌బీకేలు ఉన్నాయని, ఈ తరహా వ్యవస్థను మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడంపై అభినందనలు తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, నానో యూరియా వంటి అత్యాధునిక పద్ధతుల గురించి చర్చించారు.
డాక్టర్ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ యూరియా తదితర ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయడం వల్ల వారికి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఈ విధానానికి ఎన్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సీఎఫ్ వంటి సంస్థలు సహకరిస్తే మరింత నాణ్యంగా సేవలందించవచ్చని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల రైతులందరికీ అందుబాటులోకి రావడం లేదని, డ్రోన్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment