పొద్దున్న లేస్తే గొడవలు, పేచీలు, రాజీలు, సర్దుబాట్లు.. ఇన్నింటి మధ్య కొంత నిశ్శబ్దం కావాలి. ఒంటి మీద ఖాకీ పడింది మొదలు దొంగలు, నేరస్తులు, మోసగాళ్ల ఆటకట్టించడమే పని. వీరి నీడ కూడా పడని స్థలంలో కాసేపు గడపాలి. బయటే కాదు ఇంతులకు ఇంటిలోనూ జీవిత కాల ఉద్యోగమే కదా. ఆ తలనొప్పులు తప్పేలా మనసుకు ప్రశాంతత దొరకాలి. బాధలు, హోదాలు మరిచి దేవుడి సన్నిధిలో సేద తీరాలి. శ్రావణం ఆ సమయాన్నిస్తోంది. హడావుడిని కాస్త పక్కనపెట్టి నిమ్మళంగా పూజ గదిలో కూర్చుని వ్రతం చేసుకోవడానికి మన ‘ధైర్య’లక్ష్ములు ఇష్టపడుతున్నారు. వరలక్ష్మీ వ్రతాలకు సిద్ధమయ్యారు.
పాలకొండ రూరల్/రాజాంసిటీ: శ్రావణం వచ్చిందంటే మహిళలకు ప్రతిరోజూ ఓ పండగే. ఈ పండగ రోజుల్ని జరుపుకునేందుకు ఎవరూ మినహాయింపు కాదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా. ముఖ్యంగా ఈ శాఖలో పనిచేసే వాళ్లకు అనుక్షణం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాళ్లు అనేక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది. కఠిన సమయాలు వాళ్లకు వెన్నంటి కాదు.. ఎదురు నిలిచి ఉంటాయి. అయితే ఇంత పని ఒత్తిడిలోనూ తమ వ్యక్తిగత జీవితానికి కాసింత సమయం కేటాయిస్తున్నారు. అటు వృత్తిని.. ఇటు సంప్రదాయాల్ని పాటిస్తూ లైఫ్ బ్యాలన్స్ చేసుకుంటున్నారు. శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం, నోములు నోచుకోవడం తమ జీవితంలో ఓ భాగమే అని మనసారా నమ్ముతున్నారు. వృత్తిలో అంతే కఠినంగా కూడా వ్యవహరిçస్తున్నారు. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న పోలీసు అధికారుల్ని వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వారి అభిప్రాయాల్ని ఇలా చెప్పుకొచ్చారు.
సంప్రదాయాలకు పెద్దపీట..
నాకు మొదటి నుంచి ఆచార సంప్రదాయాలంటే మక్కు వ. చిన్ననాటి నుంచి దైవభక్తి అలవడింది. పూజ లు, వ్రతాలు కచ్చితంగా చేస్తా. ఎన్ని బందోబస్తు డ్యూటీలున్నా సరే వరలక్ష్మీ వ్రతానికి ప్రాధాన్యమిస్తా. పూజ చేస్తే ఏదో తెలియని సంతృప్తి. ప్రతిఏటా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పూజలో పాల్గొంటాం. అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తాం. ముందురోజే పూజా సామగ్రి కొనుగోలు చేస్తాను. డ్యూటీ సమయానికంటే ముందే పూజను ముగించేస్తాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందనేది నా నమ్మకం. పూజ ముగియగానే యూనిఫారమ్ ధరించి డ్యూటీకి సిద్ధమైపోతా.
– ఎల్.రమణమ్మ, ఏఎస్‌ఐ, రాజాం
వృత్తి.. దైవం
వృత్తి.. దైవం.. ఈ రెండింటిని సమదృష్టితో చూస్తా. అలా చూసినప్పుడే సమాజంలో గుర్తింపు. పోలీస్ అధికారిగా సబ్ డివిజన్ ప్రజలకు రక్షణ కల్పించటంతో పాటు వారి సుఖశాంతుల కోసం భగవంతుడ్ని ప్రార్థిస్తా. విధినిర్వహణలో నిత్యం అంకితభావంతో పనిచేసే మాకు ఈ తరహా సంప్రదాయ పూజల్లో పాల్గొన్నప్పుడు కొంత సాంత్వన లభిస్తుంది. తెలుగు వారి సంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కడున్నా కచ్చితంగా ఆచరిస్తా. ఓ మహిళగా కుటుంబ సభ్యుల క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తా. ఇలాంటి కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించడం నాకు ఆనందాన్నిస్తుంది.
–మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ
ఒత్తిడి నుంచి దూరంగా..
వృత్తితోపాటు సంప్రదాయాలను గౌరవిస్తాను. వృత్తి రీత్యా విధి నిర్వహణలో కొంతమేర ఒత్తిడి తప్పదు. వరలక్ష్మీ వ్రతంలాంటి సంప్రదాయ పండగలు, పూజలు కుటుంబ సభ్యులతో కలసి చేసుకుంటున్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిత్యం యూనిఫాంలో ఉండే మేము ఇలాంటి సమయాల్లోనే సంప్రదాయ వస్త్రాలను ధరించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. నేను పాటిస్తేనే కదా.. నా తర్వాత తరం అలవాటు చేసుకుంటుంది. వృత్తి.. దైవం రెండు కళ్లుగా భావిస్తాను. ఎంతటి వారైనా కొన్ని సమయాల్లో భగవంతుడిపై నమ్మకం ఉంచక తప్పదు.
– బి.ప్రభావతి, ఎస్‌ఐ, సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment