అయ్యారే అరిసెలు భళారే బొబ్బట్లు  | Sankranti Festival Andhra Special Pindi Vantalu In Telugu | Sakshi
Sakshi News home page

అయ్యారే అరిసెలు భళారే బొబ్బట్లు 

Published Tue, Jan 11 2022 10:41 AM | Last Updated on Tue, Jan 11 2022 2:15 PM

Sankranti Festival Andhra Special Pindi Vantalu In Telugu - Sakshi

తగరపువలస (భీమిలి): సంక్రాంతి పర్వదినాన వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా హోమ్‌ ఫుడ్స్‌ నిర్వాహకులు నోరూరించే పిండివంటలు సిద్ధం చేస్తున్నారు. పూర్వం ప్రతి ఇంట్లో రోలు, రోకలితో పిండ్లు దంచి స్వయంగా పెనం వేసి అరిసెలు, సున్ని పాకుండలు, జంతికలు, గులాబీ పువ్వులు, సున్నుండలు తయారుచేసుకునేవారు.  ఇరుగుపొరుగు కుటుంబాల వారు సాయంగా వచ్చేవారు. లేదంటే కిలోల వంతున దంచడానికి లేదా తయారు చేయడానికి మనుష్యులు ఉండేవారు. ప్రస్తుతం ఎవరికి వారు బీజీ జీవితంలో మునిగితేలు తుండటంతో సొంతంగా తయారీ మానుకున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఆర్డర్లు ఇస్తే చిటికెలో కోరిన వందల రకాల పిండివంటలు ఇంటి ముందుంచే వ్యాపారాలు పెరిగిపోయాయి.  వినియోగదారుల అభిరుచి మేరకు బెల్లం, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నువ్వులు వంటివి జోడించడమే కాకుండా సుగర్‌లెస్‌ స్వీట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి రోజులకు అనువుగా కూడా ప్రత్యేక రకాల పిండివంటలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటికప్పుడు బూరెలు, పొంగడాలు కూడా అందిస్తున్నారు.

 

కుటీర పరిశ్రమ నుంచి బేకరీల వరకు 
ఇళ్లల్లో తయారీ తగ్గిన తరువాత కిలో దగ్గర నుంచి వందల కిలోల వరకు పిండివంటలు తయారుచేసి అందించే కుటీర పరిశ్రమలు విశాఖ నగరంలో వందల్లో వెలిశాయి. స్వీట్లు, బేకరీ అయిటెమ్స్‌ తయారు చేసే పెద్ద సంస్థలు కూడా రకరకాల పిండివంటలు సిద్ధం చేసి వినియోగదారులకు ఆహా్వనం పలుకుతున్నాయి. పండగ ప్రత్యేకతగా వెదురుబుట్టలలో నింపి ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు. 

సంప్రదాయ పిండివంటలు లభ్యం 
ప్రస్తుతం మార్కెట్లో నిర్వాహకులు అరిసెలు, జంతికలు, సున్నపాకుండలతో పాటు బుల్లెట్‌ పాకుండలు, సున్నుండలు, తొక్కుడు లడ్డు, కోవా ముద్ద కుడుములు, బెల్లం మిఠాయి ఉండలు, పొంగడాలు, అప్పాలు, శనగపప్పు, పెసరపప్పు, కొబ్బరి, జున్నుతో తయార చేసే వివిధ రకాల బూరెలు, రవ్వ లడ్లు, గులాబి పువ్వులు, చంద్రకాంతలు, కజ్జికాయలు, గోరు మిఠాయి, సంపంగి పువ్వులు. సజ్జప్పాలు, గవ్వలు, చక్కిలాలు, మురుకులు, చెక్కలు, గోధుమ గొట్టాలు మొదలైన పిండివంటలు లభ్యమవుతున్నాయి. 

50కు పైగా రకాలు .. 
వినియోగదారుల అభిరుచికి అనువుగా 50 రకాలకు పైగా పిండివంటలు సిద్ధం చేస్తున్నాం. ముందురోజు ఆర్డరిచ్చినా మరుసటిరోజు అందించడానికి అనువుగా సిబ్బంది ఉన్నారు. నగరాలతో పోటీపడి నాణ్యమైన పిండివంటలు అందుబాటులో ఉన్నాయి. 
–ఆదిమూలం సత్యనారాయణ, ఎంఎఫ్‌సీ, తగరపువలస

తయారీలో ఇబ్బందులు 
పిండివంటలు తయారీ కష్టంతో కూడుకున్నది. గతంలో ఇరుగుపొరుగు సాయంతో తయారు చేసేవాళ్లం. నూనె ధరలు అందుబాటులో లేవు. పిల్లలు ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటు పడి పిండివంటలు తినడం లేదు. దీంతో కావలసినవి ఆర్డర్‌ ఇచ్చి తెచ్చుకుంటున్నాం. 
–వేమల రమ, గృహిణి

అభిరుచులు మారుతున్నాయి 
ప్రస్తుతం ఇళ్లల్లో పిండివంటలపై అభిరుచులు మారాయి. బెల్లం బదులు పంచదార, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ జోడించి కావలసిన స్వీట్లు అందుబాటులో ఉంటున్నాయి. కేవలం పండగ సమయంలోనే కాకుండా నిత్యం దొరుకుతున్నాయి. పండగవేళ అదనంగా కొనుక్కుంటున్నాం.  
–కదంబ సత్యవతి, గృహిణి.

ఇంట్లో చేసినవి నిల్వ ఉండేవి.. 
పూర్వం సంక్రాంతికి వారంరోజుల ముందే బియ్యం నానబెట్టి, దంచి పిండివంటలు చేసేవాళ్లం. ఇవి చాలారోజులు నిల్వ ఉండేవి. ప్రస్తుతం ఇంత శ్రమ పడలేక రెడీమేడ్‌గా దొరికే పిండివంటలు కొనుక్కుంటున్నాం. దీంతో ఇళ్లల్లో పిండివంటలు తయారు చేసే సందడి తగ్గింది. వినియోగం మాత్రం యథావిధిగా ఉంటున్నాయి. 
–కంచుబోయిన లక్ష్మీ, గృహిణి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement