సాక్షి, అమరావతి: ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల పనితీరుపై త్వరలో స్కోరింగ్ కార్డులు జారీ చేయనున్నారు. వారి పనితీరు మెరుగుపరుచుకుని పోటీతత్వం పెంచుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.30 కోట్లను కేటాయించింది. దీంతో ఆర్టీసీలో త్వరలో ఆన్‌లైన్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో జారీ చేసే టికెట్ల దగ్గర్నుంచి ఏ రూట్‌లో వెళుతున్నారు? ఎక్కడెక్కడ బస్సు ఆపారు? తదితర వివరాలన్నీ రియల్ టైమ్‌లో ఆర్టీసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా డ్రైవర్లు, కండక్టర్ల పనితీరుపై స్కోరింగ్ కార్డుల జారీ చేపడతారు. డ్రైవర్లు, కండక్టర్ల తప్పులుంటే వారికి ఆధారాలతో సహా రియల్ టైమ్‌లో నమోదైన వీడియో ఫుటేజీలో చూపిస్తారు. ఉదాహరణకు ఒక స్టాప్‌లో బస్సును డ్రైవర్ ఆపకుండా వెళ్లాడనుకుంటే, ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తే, ట్రాకింగ్‌లో స్పష్టంగా బస్సు ఆపకుండా వెళ్లాడా? లేదా? అనేది కనిపిస్తుంది. అయితే డ్రైవర్లు, కండక్టర్లకు పనిష్మెంట్ ఇవ్వకుండా పనితీరు మెరుగుపరుచుకునేందుకు మాత్రమే ఈ స్కోరింగ్ కార్డులను జారీ చేయనున్నారు.
రోజుకు 4 వేల వరకు ఫిర్యాదులు
ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు ఫోన్‌కాల్స్ ద్వారా 4 వేల వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. 0866–2570005 నంబర్‌కు అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తన, బస్సు ఆపలేదనే కారణాలపై ఎక్కువ ఫిర్యాదులొస్తున్నాయి. 24 గంటలూ ఆర్టీసీలో 24 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మెయిళ్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిపై చేసిన ఫిర్యాదులకు ఆధారాలు ప్రస్తుత విధానంలో ఉండటం లేదు. ఆన్‌లైన్ ప్రాజెక్టు అమలైతే ఫిర్యాదులపై ఆధార సహితంగా స్కోరింగ్ కార్డులను జారీ చేయడానికి వీలుంటుంది.
40 శాతం మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి
ఆన్‌లైన్ ప్రాజెక్టు ఆరంభం అయ్యాక డ్రైవర్లకు టెక్నాలజీపై శిక్షణ అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీలో 40 శాతం మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి అయిందని ఐటీ విభాగం అధికారులు తెలిపారు. ఆర్టీసీలో డిజిటల్ విధానంపైనా శిక్షణ ఇస్తున్నారు.
ఆర్టీసీ కార్యకలాపాలన్నీ రియల్ టైమ్‌లోనే..
ఆర్టీసీలో ఆన్‌లైన్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అంతా రియల్ టైమ్‌లోనే పర్యవేక్షణ జరుగుతుంది. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు స్కోరింగ్ కార్డులు జారీ చేస్తాం. ఈ స్కోరింగ్ కార్డుల ఉద్దేశం వారిని ఇబ్బంది పెట్టాలనేది కాదు. వారి పనితీరు మెరుగుపరుచుకుని ప్రయాణికుల ఆదరణ మరింతగా పెంచుకోవడానికే. రియల్ టైమ్ ద్వారా ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఫిర్యాదులు తగ్గిపోతాయి. ఆర్టీసీ సిబ్బంది తప్పు ఉంటే వారికే స్కోరు తగ్గిపోతుంది.
– సుధాకర్, చీఫ్ ఇంజనీర్, ఆర్టీసీ ఐటీ విభాగం
Comments
Please login to add a commentAdd a comment