‘సంక్షేమ’ క్యాలెండర్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం | Several key decisions In the AP cabinet meeting | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ’ క్యాలెండర్‌ ప్రకటించిన ఏపీ సర్కార్‌

Published Wed, Feb 24 2021 3:02 AM | Last Updated on Wed, Feb 24 2021 12:21 PM

Several key decisions In the AP cabinet meeting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్‌ను ప్రకటించింది. 2021 ఏప్రిల్‌ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలలను ఖరారు చేసింది. బడ్జెట్‌ కేటాయింపులను సైతం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వాటిని మీడియాకు తెలియచేశారు. ఆ వివరాలు ఇవీ...
మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పథకాలతో 5,08,08,220 మందికి లబ్ధి
సంక్షేమ పథకాల ద్వారా 5,08,08,220 మందికి ప్రయోజనం చేకూరనుంది. నెలవారీ పింఛన్లతో కలిపి 5,69,81,184 మందికి మేలు జరగనుంది. ఇవికాకుండా వైఎస్సార్‌ లా నేస్తం కింద దాదాపు 2,012 మందికి ప్రతి నెలా లబ్ధి కలగనుంది. జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మందికి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 30,16,000 మందికి, ఇమామ్, మౌజమ్‌లకు ఆర్థిక సాయం ద్వారా 77,290 మందికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ఇంటికే రేషన్‌ ద్వారా సంక్షేమ ఫలాలను ఇంటి ముంగిటికే చేరవేస్తోంది.

మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం
వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 2021 ఏప్రిల్‌ నుంచి కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రైవేటు లేఅవుట్‌లో 5 శాతం భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపు కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ల్యాండ్‌ బ్యాంకును వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం వినియోగించనుంది. తద్వారా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు అనుమతి లేని లే అవుట్ల కట్టడికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన నేపథ్యంలో వాటికి కుళాయి, కరెంటు కనెక్షన్‌ కూడా ఇవ్వరాదని నిర్ణయించారు.

పేదల ఇళ్లకు పెద్ద ఊరట
300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల నుంచి గత సర్కారు వసూలు చేసిన డబ్బులను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1,43,600 మందికి ఒకే ఒక్క రూపాయితో టిడ్కో ఇళ్లను అప్పగించాలని నిర్ణయించారు. 365 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదార్లకు రూ.25 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు రూ.50 వేలు చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ మేరకు మినహాయించిన నగదును వెనక్కి ఇవ్వనున్నారు. టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరు పెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

– రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఆర్బీకేలు పరిపుష్టం
రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్‌ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్‌ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విత్తనం నాటుకునే ముందు, పంట చేతికి వచ్చిన తర్వాత రైతుకు అవసరమైన 
మౌలిక సదుపాయలు కల్పించడం మల్టీ పర్పస్‌ సెంటర్ల లక్ష్యం. రూ.2719.11 కోట్లతో ఫామ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం పనులన్నింటినీ సుమారు రూ.12 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది.

క్యాబినెట్‌ ఇతర నిర్ణయాలు ఇవీ
– చిత్తూరు జిల్లా పెనుమూరు, కార్వేటినగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకల ఆసుపత్రులుగా మార్చేందుకు ఆమోదం. 
– పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌ పోస్టులు, 1 నాన్‌ టీచింగ్, 13 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు మంజూరు.
– వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక ప్రక్రియకు ఆమోదం. ఎస్‌బీఐ క్యాప్‌ సిఫార్సులను బట్టి లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ జేవీగా ఎంపిక. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి తొలి దశలో రూ.10,082 కోట్లు, రెండో దశలో రూ.6 వేల కోట్లు వ్యయం కానుంది. జేవీపై వైఎస్సార్‌ స్టీల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి ఎల్‌ఓఏ ఇచ్చేందుకు అనుమతి. 
– వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు కేటాయించేందుకు ఆమోదం. ఈ స్ధలంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిర్ణయం.
– వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూమి కేటాయింపు.
– వైఎస్సార్‌ జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి స్ధలం కేటాయింపు. 
– తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైం బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. పోర్టు కార్యకలాపాల కోసం భూమి కేటాయింపు. ఎకరా రూ.25 లక్షలు చొప్పున భూమి కేటాయింపు. 
– ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణకు ఆమోదం. 
– వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి అనుమతి. 12 పోస్టులు మంజూరు.
– చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి ఆమోదం.
– తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిన టీటీడీ. అందుకు ఆమోదం.
– ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డిసిప్లినరీ కేసుల విచారణను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయం. 
– కాకినాడ సెజ్‌ కోసం గత సర్కారు బలవంతంగా భూములు లాక్కోవడంతో పరిహారం కూడా తీసుకోకుండా భూమి కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న రైతులకు 2,180 ఎకరాలను తిరిగి ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ పర్యటన సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది.
– రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వ్యర్థాలాను సేకరించేందుకు 2,700 వాహనాలు కేటాయించాలని నిర్ణయం. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతి మున్సిపాలిటీని ‘సూరత్‌’తరహాలో పరిశుభ్రంగా ఉంచేలా చెత్త సేకరణకు చర్యలు చేపట్టనున్నారు. 

బాబు బూటకపు హామీలు.. 
– కాకినాడ సెజ్‌ భూములపై మంత్రి నాని
ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పేవన్నీ బడాయి, బూటకపు మాటలేనని, సీఎం జగన్‌ మాట ఇస్తే కచ్చితంగా ఆచరించి నిలబెట్టుకుంటారనే విషయం కాకినాడ సెజ్‌ భూముల వ్యవహారంలో మరోసారి రుజువైందని మంత్రి పేర్ని నాని చెప్పారు. కాకినాడ సెజ్‌ భూములపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను మీడియాకు మంత్రి చూపించారు. చంద్రబాబు తలపాగా చుట్టి సెజ్‌ భూముల్లో ఏరువాక సాగించారని, ఆ భూములు రైతులకు తిరిగి ఇచ్చి తన పుట్టిన రోజు వారి సమక్షంలో చేసుకుంటానని నమ్మబలికారన్నారు. చంద్రబాబును నమ్మి రైతులు ఓట్లేస్తే హామీని నిలబెట్టుకోలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ పర్యటన సందర్భంగా మన ప్రభుత్వం రాగానే సెజ్‌ భూములు రైతులకు తిరిగి అప్పగిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం అసెంబ్లీలో తీర్మానం
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేలా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాశారని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం మొదట స్పందించి కేంద్రానికి లేఖ రాసింది ముఖ్యమంత్రేనని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమై అసెంబ్లీలో తీర్మానం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రై వేటీకరణ ప్రయత్నాలు విరమించుకుని చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఢిల్లీలో ఎంపీలంతా కృషి చేస్తున్నారని, అవసరమైతే ఆందోళన నిర్వహించేందుకు కూడా వెనుకడుగు వేయబోమని చెప్పారు.

అమరావతిని అభివృద్ధి చేస్తాం
తమను దూషించినా.. ద్వేషించినా అమరావతిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి పేరుతో కొందరు నిరసన దీక్షలు చేపట్టి మంత్రులు, ఎంపీల గడ్డి బొమ్మలు ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా తిడుతున్నప్పటికీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టిందని వివరించారు. అమరావతితోపాటు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ అభిలాష అని స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణతో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించే సంకల్పంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పారు. అమరావతిని వదిలేయలేదని, వేగంగా అభివృద్ధి చెందేలా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా వంతెన, యాక్సెస్‌ రోడ్ల నిర్మాణానికి పక్కా కార్యాచరణతో పనిచేస్తున్నామని వివరించారు. 

అగ్రవర్ణ పేద మహిళలకు ‘ఈబీసీ నేస్తం’
ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టి కేబినెట్‌లో ఆమోదించింది. బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేదలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం తరహాలో అమలు కానుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. 

2021–22 నవరత్నాల క్యాలెండర్‌ అమలు ఇలా... 
► ఏప్రిల్‌: వసతి దీవెన 15,56,956 మందికి లబ్ధి 
► ఏప్రిల్, జూలై, డిసెంబర్, ఫిబ్రవరి: జగనన్న విద్యా దీవెన (సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌) 18,80,934 మందికి లబ్ధి  
► జూన్‌: జగనన్న విద్యా కానుక– 42,34,322 మందికి లబ్ధి 
► ఏప్రిల్‌: రైతులకు వడ్డీ లేని రుణాలు (రబీ 2019, ఖరీఫ్‌ 2020) 66,11,382 మందికి లబ్ధి  
► ఏప్రిల్‌: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు – 90,37,255 మందికి లబ్ధి  
► మే: 2020 ఖరీఫ్‌కి సంబంధించి పంటల బీమా చెల్లింపు 
► మే, అక్టోబర్, జనవరి 2022: రైతు భరోసా (మూడు దఫాలుగా ), 54,00,300 మందికిపైగా రైతులకు ప్రయోజనం 
► మే: మత్స్యకార భరోసా–1,09,231 మందికి లబ్ధి  
► మే: మత్స్యకార భరోసా కింద డీజిల్‌ సబ్సిడీ చెల్లింపు, 19,746 మందికి లబ్ధి  
► జూన్‌: వైఎస్సార్‌ చేయూత– 24,55,534 మందికి లబ్ధి  
► జూలై: వైఎస్సార్‌ వాహన మిత్ర– 2,74,015 మందికి లబ్ధి  
► జూలై: కాపునేస్తం–3,27,862 మందికి లబ్ధి  
► ఆగస్టు: రైతులకు వడ్డీ లేని రుణాలు (ఖరీఫ్‌ 2021కి సంబంధించి)– 25 లక్షల మందికి లబ్ధి  
► ఆగస్టు: ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు ఇన్సెంటివ్‌ల చెల్లింపు– 9,800 పరిశ్రమలకు ప్రయోజనం 
► ఆగస్టు: నేతన్న నేస్తం– 81,703 మందికి లబ్ధి  
► ఆగస్టు: అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు పరిహారం చెల్లింపు– 3,34,160 మందికి లబ్ధి  
► సెప్టెంబర్‌: వైఎస్సార్‌ ఆసరా–87,74,674 మందికి లబ్ధి  
► అక్టోబర్‌: జగనన్న తోడు– 9.05 లక్షల మందికి లబ్ధి  
► అక్టోబర్‌: జగనన్న చేదోడు (దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు)– 2,98,428 మందికి లబ్ధి  
► నవంబర్‌: ఈబీసీ నేస్తం (ఆర్థికంగా వెను కబడిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఇతర అగ్రవర్ణాల మహిళలకు ల బ్ధి. దాదాపు 6 లక్షలకుపైగా లబ్ధిదారులు) 
► జనవరి (2022): అమ్మఒడి– 44,48,865 మందికి లబ్ధి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement