సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం దేశ వ్యాప్తంగా సంక్షేమాంధ్రప్రదేశ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. పీఆర్‌ఎస్ ఇండియా ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్టు ద్వారా మరోమారు ఇదే విషయం స్పష్టమైంది. 2021–2022 ఏడాదిలో దేశంలోని అన్ని రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులను అధ్యయనం చేసిన పీఆర్‌ఎస్ సంస్థ ‘రాష్ట్రాల ఆర్థిక స్థితి (స్టేట్ ఆఫ్ స్టేట్స్ పైనాన్సెస్)’ నివేదికను విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని ఆ నివేదికలో పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఏపీ అత్యధిక కేటాయింపులు చేసినట్లు వివరించింది.
ఆయా వర్గాల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఆమోదించిన వార్షిక బడ్జెట్‌లో ఏకంగా 13.1 శాతం నిధులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించినట్టు పీఆర్‌సీ నివేదిక వెల్లడించింది. ఆయా వర్గాల సంక్షేమానికి నిధుల కేటాయింపులో రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ 7.9 శాతం, మూడవ స్థానంలో మహారాష్ట్ర 4.8 శాతం ఖర్చు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం గమనార్హం. దేశంలో ఐదు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కేవలం 3 శాతానికి లోపుగానే ఈ వర్గాలకు నిధుల కేటాయింపులతో సరిపెట్టడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్ అయితే కేవలం 0.2 శాతం నిధులు మాత్రమే కేటాయించి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఇంకా ఏం చెప్పిందంటే..
అన్ని రాష్ట్రాలూ అప్పులు చేయక తప్పని పరిస్థితి
► 2019–20లో కనిపించిన ఆర్థిక మందగమనం రాష్ట్రాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా కేంద్రంతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాలు అప్పులు చేయడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
► జీఎస్‌టీ రాబడిలో 14 శాతం వార్షిక వృద్ధికి సంబంధించిన పరిహారం హామీ ముగియనుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంపునకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రాలకు ఆశించిన ఆదాయం కోసం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ కూడా ఉంది.
► మరోవైపు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రాష్ట్రాల నుంచి అదనపు కేటాయింపులు, నిధుల హామీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని ఆదుకునేలా కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉంది.
► స్థానిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం ద్వారా ఆరోగ్యానికి నిధుల కేటాయింపులు జరపాలన్న 15 వ ఆర్థిక సంఘం సిఫార్సును అమలు చేసేందుకు రాష్ట్రాలకు తగిన గ్రాంట్ల వాటాను పెంచాలి. కేంద్ర పన్నుల వాటా 41 శాతం కాగా, ప్రత్యేకంగా 2020–21లో సెస్, సర్‌చార్జ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గింది.
► పన్నుకు బదులు సెస్, సర్‌చార్జ్‌ల పేరుతో వచ్చే ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు తగిన కేటాయింపులు జరపడం లేదు. కోవిడ్–19 ప్రభావం, ఆర్థిక మందగమనం కారణంగా ఆదాయ వనరులు దెబ్బ తినడంతో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాలపై అప్పుభారం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2021 నుంచి 2026 వరకు జీఎస్‌టీ, కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపు ద్వారా రాష్ట్రాలకు నిధులను పెంచి అందించాలి.
కోవిడ్‌లోను ఆంధ్రప్రదేశ్‌లో ఆగని సంక్షేమం
► కోవిడ్–19 దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పెద్ద దెబ్బ తీసింది. 2020–21లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. 2019–20 నుండి 2020–21లో రాష్ట్రాల ఆదాయం తగ్గడంతో పాటు వ్యయం పెరిగింది.
► అయితే ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాల వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించి ప్రజలను ఆదుకున్నాయి.
ప్రతిఫలాపేక్ష లేకుండా అధ్యయనం
పీఆర్‌సీ ఇండియా సంస్థ 2005 నుంచి జాతీయ స్థాయిలో ‘పీఆర్‌ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్’ పేరుతో అనేక అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టులు విడుదల చేస్తోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వడంలో ఈ సంస్థకు గుర్తింపు ఉంది. తాజాగా బడ్జెట్ కేటాయింపులపై సుయష్ తివారి, సాకేత్ సూర్య పేరుతో నివేదిక విడుదలైంది. బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగం, నిర్వహణ వంటి అనేక అంశాలపై 35 పేజీల నివేదికలో అనేక కోణాలను ప్రస్తావించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment